రోజూ జరిగితే అవి అద్భుతాలు కావు. సూర్యచంద్రులు ప్రతిరోజూ కనిపిస్తారు. కానీ మనం పట్టించుకోము. గ్రహణాల సమయంలో రాహుకేతువులు అంత గొప్ప సూర్యచంద్రులు ఆవురావురుమంటూ కొంచెంకొంచెంగా మింగేస్తుంటే ఆ అద్భుతాలను వీక్షిస్తూ పులకించిపోతాము. ఖగోళ వింతలుగా కథలు చెప్పుకుంటూ ఆనందిస్తాము. అలాగని ప్రతిరోజూ గ్రహణాలు సంభవిస్తుంటే అసలు వాటివంక కన్నెత్తి చూడము.
రాజకీయాల్లో కూడా అలాంటి అద్భుతాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. చండప్రచండంగా, దుర్నిరీక్ష్యంగా వెలిగిపోతున్న వెలిగిపోతున్న బలమైన శక్తులను ఢీకొట్టి వాటి కొమ్ములు విరిచిన వీరాధివీరులు చాలా అరుదుగా పుట్టుకొస్తారు. గత నలభై ఏళ్లలో మన నయనాలముందు అలాంటి అద్భుతాలు రెండుసార్లు సంభవించాయి. దేశంలోనే అలాంటి అద్భుతాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగాయి. వాటిని సాధించి లోకోత్తర వీరులుగా వీరతాళ్ళు వేయించుకున్నది మొదటివారు నందమూరి తారక రామారావు కాగా రెండవ వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి!
ఎందుకు వీరిద్దరూ వీరతాళ్లకు అర్హులు అయ్యారు? వీరిద్దరూ సొంతంగా పార్టీలు స్థాపించారు. ఇరవై అయిదేళ్లనుంచి ఏకచత్రాధిపత్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏలుతున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తానంటూ గర్జించి తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రం మొత్తం మూడుసార్లు చైతన్యరధం మీద పర్యటించి యోధానుయోధులు అనదగిన కాంగ్రెస్ పులులను చావుదెబ్బకొట్టి రెండు వందల స్థానాలను సాధించి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు. ఒక సినిమా నటుడు ఆ విధంగా రాజకీయ పార్టీని పెట్టి కేవలం తొమ్మిది నెలల్లో మొదటి విడతలోనే అధికార పార్టీని మట్టి కరిపించడం భారతదేశంలో తొలిసారిగా సంభవించింది. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రిగా సినిమా నటుడు ఎంజీయార్ పాలించారు. కానీ ఆయన అప్పటికి పార్టీ పెట్టి చాలాకాలం అయింది. పైగా అది డీఎంకే నుంచి చీలిన ఒక ముక్క మాత్రమే. కొత్త పార్టీ కాదు.
ఇక మళ్ళీ అలాంటి అద్భుతం విభాజిత ఆంధ్రప్రదేశ్ లో 2019 లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన జగన్మోహన్ రెడ్డి సొంతంగా వైఎస్సార్సీపీ అనే పార్టీని పెట్టుకున్నారు. మొదటి విడత కలిసిరాలేదు. అందుకు రాష్ట్ర విభజన ఒక కారణంకాగా, మీడియా చేసిన చంద్రబాబు అనుభవపు భజన మరొక కారణం. కానీ, రెండో విడతలో మాత్రం జగన్ బ్రహ్మాస్త్రం గురి తప్పలేదు. నేరుగా వెళ్లి ప్రత్యర్థి ముఖాన్ని పచ్చడి చేసింది.
ఆ విధంగా సొంతంగా పార్టీ పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు రెండు బలమైన పార్టీలను మట్టికరిపించారు. అయితే దీనిలో విశేషం ఏముంది? ఈమాత్రానికే వీరతాళ్ళు ఎందుకు? గెలుపోటములు సహజం కదా అనే సందేహం రావచ్చు. ఎన్టీఆర్ తరువాత…లేదా ఎన్టీఆర్ కన్నా ఎక్కువ గ్లామర్ ఉంది, అభిమానులు ఉన్నారు…ఎక్కువ ఇమేజ్ ఉంది…బోలెడంత బంధుబలం ఉంది..అని విర్రవీగిన చిరంజీవి సొంతంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టుకుని బొక్కబోర్లా పడి విఫలుడుగా మిగిలిపోయాడు. ఇక అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న జయప్రకాశ్ నారాయణ్ లోక్ సత్తా పార్టీ పెట్టి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అన్నయ్య కన్నా నాకే ఎక్కువ గ్లామర్ ఉంది, అభిమానులు ఉన్నారని గర్వించి ఎగిసిపడిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి “అక్క ఆరాటమే కానీ బావ బతకడు” అన్నట్లు మొదటి ఎన్నికల్లోనే పాతాళానికి జారిపోయారు!
మన కళ్ళముందే చాలామంది సినిమా నటులు రాజకీయపార్టీలు పెట్టారు. విజయకాంత్ విజయం పేరులోనే తప్ప పార్టీగా పరాజయమే దక్కింది. రజనీకాంత్, కమలహాసన్ రాజకీయపార్టీలు అంటూ కిందామీదా పడుతూ నవ్వులపాలవుతున్నారు.
తమ సొంత పార్టీల ద్వారా రెండు బలమైన పార్టీలను జయించి అధికారలక్ష్మిని చేపట్టిన ఇద్దరు మగాళ్లు కాబట్టే ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డి స్వయంనిర్మిత అద్భుతాలు కాగలిగారు. ఎన్ని వీరతాళ్ళకైనా వారు అర్హులే. ఇలాంటి అద్భుతాలు శతాబ్దిలో ఒకటో రెండో సంభవిస్తాయి. ఆ రెండింటినీ చూసినవారు అదృష్టవంతులు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు