Raghurama Krishnam Raju: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. వైసీపీ నుంచి గెలిచి, ఆ పార్టీ అధినేతపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసి, ప్రతిపక్షాలకు ఆనందాన్ని పంచిన రఘురామకృష్ణంరాజుకు.. అప్పట్లో ఓ వర్గం మీడియా ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదనే చెప్పాలి! ఆయన ప్రతీ రోజూ లైవ్ ఇస్తుంటే.. ఆల్ మోస్ట్ ఓ వర్గం న్యూస్ ఛానల్స్ అన్నీ ఆ లైవ్ కవర్ చేసేవి.. ప్రైమ్ న్యూస్ లో అత్యంత ప్రాధాన్యత కల్పించేవి. ఇక డిబేట్ ల సంగతి సరే సరి! అయితే.. ఇప్పుడు మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదనే చర్చ తెరపైకి వచ్చిన నేపథ్యంలో.. పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి..!
ఒకప్పుడు ఏపీలో వైసీపీ గురించి, జగన్ గురించి మాట్లాడే సాహసం ప్రతిపక్షాలు చేయని సమయంలో.. ఆర్.ఆర్.ఆర్. ఒక్కరే ఆ బాధ్యత తీసుకున్నారు కదా?
ఆయన చెప్పింది కరెక్టా కాదా అనే సంగతి పక్కనపెడితే.. ఆయన మాటలకు ఫుల్ కవరేజ్ ఇచ్చేవారు కదా?
కిందో మీదో పడి ఆయన ఉండి సీటు తెచ్చుకుని, గెలిచిన తర్వాత క్షత్రిక కోటాలో మంత్రి పదవి ఆశించినా.. కంటి తుడుపు చర్య చేపట్టారు కదా?
ఈ నేపథ్యంలో.. నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, విపక్షాలకు మైలేజీ తెచ్చిన రఘురామ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి, ఓ వర్గం మీడియాకు వైట్ ఎలిఫెంట్ గా మారారా?
ఓ పక్క సీబీఐ కేసు, మరో పక్క పీవీ సునీల్ కుమార్ వాయింపు మధ్య.. రఘురామ తరుపున మాట్లాడే కూటమి నాయకుడు.. ఆయన తరుపున డిబేట్ పెట్టే ఓ వర్గం మీడియా కనిపించకపోవడాన్ని ఏమనుకోవాలి?
దీన్నే చాలా మంది రఘురామను కరివేపాకులా వాడుకున్నారని అనడాన్ని సమర్థించవచ్చా..?

ఒకప్పుడు రఘురామ కృష్ణంరాజు అంటే టీడీపీకి, ఆ పార్టీ అనుబంధ మీడియాకు చాలా అభిమానం అన్నట్లుగా ఉండేది వాతావరణం! అది నిజమని నమ్మారో ఏమో కానీ… ట్రిపుల్ ఆర్ కూడా వారిని అలానే ట్రీట్ చేసేవారు! ప్రధానంగా నాటి అధికార వైసీపీని విమర్శించడంలో రఘురామ పాత్రకు అంత విలువ ఉండేది.. వారూ ఇచ్చేవారు! కట్ చేస్తే లెక్కలు మారిపోయాయి.. ఇప్పుడు ఆ పార్టీకి, వారి అనుబంధ మీడియాకు రఘురామ వైట్ ఎలిఫేంట్ లా మారిపోయారనే చర్చ వినిపిస్తోంది.
గతంలోలాగా తనకు అటు టీడీపీ నుంచి, జనసేన నుంచి, ఓ వర్గం మీడియా నుంచి విపరీతమైన మద్దతు ఉన్నట్లుగా.. ఇప్పుడు కూడా ఉంటుందని అనుకున్నారో ఏమో కానీ.. సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ ను గిల్లడం మొదలుపెట్టారు రఘురామ! అయితే.. ఆయన వ్యాఖ్యలకు అటు అధికారపార్టీలోని నేతల నుంచి కానీ, ఓ వర్గం మీడియా నుంచి కానీ ఏమాత్రం మద్దతు రాలేదు! పైగా అయన వ్యాఖ్యలకు పీవీ సునీల్ కుమార్ కౌంటర్స్ ఇచ్చిన తర్వాత ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రఘురామ వ్యాఖ్యలకు బలంగా తగులుకున్న పీవీ సునీల్… బ్యాంకులను రఘురామతో పాటు ఆయన కుటుంబమంతా మోసిగించిందని పోస్టులు పెట్టారు. ఆయన జైలుకు పోవడం ఖాయమని, ఆయన ఉప సభాపతి స్థానంలో ఉండి అరెస్ట్ అయితే దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోతుందని.. చంద్రబాబు, పవన్, లోకేష్ పడుతున్న కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని.. ఈ విషయంలో ఒక సారి ఆలోచించాలంటూ సునీల్ బాంబు పేల్చారు.
అయితే… ఈ పరిణామాలపై అటు టీడీపీ, ఇటు ఓ వర్గం మీడియా మౌనాన్ని ఆశ్రయించడం గమనార్హం. ఇలా సొంత పార్టీలోనూ, మీడియాలోనూ ఆదరణ కొరవడటంతో రఘురామ సైతం ఒంటరైపోయాననే ఆలోచనతో ఏమో.. ఆయన కూడా మౌనంగా ఉండిపోతున్నారు! మరోవైపు.. రఘురామకు మద్దతుగా మాట్లాడితే దళితులకు దూరం అవుతామనే భయం టీడీపీకి ఉందని.. అందుకే ఆ పార్టీ నాయకులు, ఆ వర్గం మీడియా నోర్లు మూయించేశారని అంటున్నారు!
ఈ నేపథ్యంలోనే… పాపం రఘురామ కృష్ణంరాజు… టీడీపీకి, ఆ పార్టీ అనుకూల మీడియాకు కూరలో కరివేపాకులా అయిపోయారే అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు! చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అంటూ మరికొంతమంది స్పందిస్తున్నారు.

