ఏపీలో కొత్త పత్రిక.. “నమస్తే ఆంధ్రప్రదేశ్”!

ఇంతకాలం ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆరెస్స్ ను జాతీయపార్టీ బీఆరెస్స్ గా మార్చిన అనంతరం గేర్ మార్చారు బీఆరెస్స్ అధినేత కేసీఆర్. ఈ క్రమంలో.. ఏపీలో కూడా తెలంగాణ మాదిరిగానే సీరియస్ పాలిటిక్స్ చేయాలని ఫిక్స్ అయిన కేసీఆర్… తెలంగాణలో ఎలాగైతే “నమస్తే తెలంగాణ” నడుపుతున్నారో అలానే ఆంధ్రలో కూడా “నమస్తే ఆంధ్రప్రదేశ్” ను ఏర్పాటుచేయబోతున్నారు.

అవును… తెలంగాణలో “నమస్తే తెలంగాణ”, “టీ న్యూస్” టీవీ చానల్ తో పాటు “తెలంగాణ టుడే” పేరుతో ఒక ఇంగ్లిషు దినపత్రికను తీసుకొచ్చిన కేసీఆర్.. ఇదేక్రమంలో త్వరలో “నమస్తే ఆంధ్రప్రదేశ్” పేరుతో ఏపీ రాజకీయాలకోసం ఒక దినపత్రికను తీసుకురానున్నారట. దీనికి సంబంధించిన లేఔట్ ను ఇప్పటికే ఖరారు చేసి, డమ్మీలు కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది!

అయితే ఈ పత్రిక కోసం ప్రత్యేకంగా ఇంకా స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోని యాజమాన్యం… ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్న నమస్తే తెలంగాణ సిబ్బందితోనే “నమస్తే ఆంధ్రప్రదేశ్” ఎడిషన్ కు అవసరమైన కంటెంట్ ను జనరేట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

అంతా అనుకూలంగా జరిగితే వీలైనంత తొందర్లో విజయవాడ కేంద్రంగా ఈ దినపత్రిక ప్రచురణ మొదలవ్వొచ్చని తెలుస్తోంది. తెలంగాణలో టీఆరెస్స్ సక్సెస్ లో కీలక భూమిక పోషించిన “నమస్తే తెలంగాణ” మీడియా సంస్థ.. “నమస్తే ఆంధ్రప్రదేశ్” విషయంలో ఏమేర సక్సెస్ అవుతుందన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడ్దాల్సిందే!