వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, రాజకీయ సన్యాసం ప్రకటించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ సీటు వైసీపీ తరఫున కూటమి పార్టీలకు అందజేయడం, దానిపై టీడీపీ, బీజేపీ మధ్య వాదనలు నడుస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ముఖ్యంగా ఈ సీటు పట్ల బీజేపీ అగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కూటమి ధర్మం ప్రకారం ఈ సీటు జనసేనకు దక్కాలని భావించినప్పటికీ, టీడీపీ నుంచి జనసేనకు ముందే మంచి బంపర్ ఆఫర్ రావడంతో జనసేన ఈ సీటు పై ఆసక్తి చూపలేదు. దీంతో కూటమిలో ఇప్పుడు ఈ సీటు బీజేపీ లేదా టీడీపీ మధ్యనే ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ బలం, పరిస్థితులు చూసుకుంటే టీడీపీ కూటమిలో కీలక పాత్ర పోషిస్తుండడంతో ఈ సీటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇక బీజేపీకి ఈ సీటు దక్కితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్ నేతలు లైమ్ లైట్‌లోకి రావడానికి ఇది మంచి అవకాశం.
గడచిన ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో దిగినప్పటికీ, విజయం సాధించలేకపోయిన నల్లారి ఇప్పుడు ఈ రాజ్యసభ సీటు ద్వారా మళ్లీ రాజకీయంగా చురుకుగా మారవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, నల్లారి మధ్య పాత అనుబంధం ఉన్న నేపథ్యంలో, బీజేపీ నుంచి నల్లారి పేరును ప్రతిపాదిస్తే చంద్రబాబు వ్యతిరేకించకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో, బీజేపీ తమ రాజకీయ ప్రాధాన్యతను పెంచుకునే దిశగా ఈ సీటు కోరితే, కూటమి సమీకరణాల ప్రకారం అది సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తానికి ఈ రాజ్యసభ సీటు ఎవరికీ దక్కినా, కూటమి బలగాల మధ్య రాజకీయ సమీకరణాలు కొత్త మలుపులు తీసుకునే అవకాశం ఉంది. నల్లారి పునరాగమనంతో బీజేపీ తమ స్థాయిని పెంచుకోవాలని భావిస్తుండగా, టీడీపీ మాత్రం తన పట్టును మరింత బలపరచాలని చూస్తోంది. రాజ్యసభ సీటు ఎవరికీ దక్కుతుందో చూడాల్సి ఉంది.