సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరికి వారే రాజులు. ఓ స్టేజ్ వచ్చే వరకు ఎన్నో రకాల అవమానాలు, అపహాస్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎంత పెద్ద స్టార్‌కు అయినా తప్పదు. అమితాబ్ బచ్చన్‌కు అయినా, రజనీకాంత్‌కు అయినా, చిరంజీవికి అయినా సరే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవమానాలు జరిగాయి. అయితే వారు వాటిని ఛాలెంజ్‌లా తీసుకుని ఈ స్థాయికి వచ్చారు. తాజాగా ఇదే విషయాన్ని నాని వివరించాడు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమా సందడి మొదలైంది. సుధీర్ఘమైన విరామం తరువాత ఓ పెద్ద సినిమా, అన్నిరకాలు అందరూ ఎదురుచూస్తున్న V సినిమా విడుదలైంది. ఇప్పటి వరకు అన్నీ చిన్న సినిమాలే ఓటీటీలో వచ్చాయి. కానీ V మాత్రం ఓటీటీలో వచ్చిన మొదటి పెద్ద సినిమా. ఈ క్రమంలోనే Vకి మంచి ప్రమోషన్స్ చేశారు. వీలైనంతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని మాట్లాడుతూ ఆసక్తికరమైన అంశాల గురించి చర్చించాడు. కెరీర్‌లో స్టార్టింగ్‌లో తనకు ఎదురైన సంఘటనల గురించి తెలిపాడు.
‘అవమానాలు జరుగుతాయి. వాటిని కెరీర్ లో ఓ ప్రాసెస్ గా తీసుకోవాలి. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు కొన్ని కొన్ని జరుగుతుంటాయి. అవన్నీ ఫేస్ చేయకపోతే ఈరోజు ఈ కిక్ ఉండదు కదా. పైగా ఏదీ ఈజీగా రాకూడదు. కష్టపడాల్సిందే. కొన్ని అవమానాలు జరగాల్సిందే. కానీ జరిగిన అవమానాల్ని తలుచుకుంటూ, దాని గురించి మాట్లాడుతూ ఉండకూడదు. ఎంజాయ్ చేయాలంతే’ అంటూ నాని ఎంతో స్పోర్టీవ్‌గా చెప్పుకొచ్చాడు.