మోడీకి షాకిచ్చిన మాజీ ఐఏఎస్… ఇక అభివృద్ధి అనరేమో!

తనగురించి తాను చెప్పుకునే సమయంలోనూ.. తన మందిమాగాదులు డప్పులు వాయించే సమయంలోనూ చెప్పే మాట… మోడీ అంటే అభివృద్ధి – అభివృద్ధి అంటే మోడీ అని! ఇది ఎంతవరకూ కరెక్ట్ అనేది ప్రజలందరికీ సుస్పష్టమైన సంగతి తెలిసిందే. దాని తాలూకు ప్రతిఫలం రాబోయే ఎన్నికల్లో రావొచ్చు కూడా. ఆ సంగతి అలా ఉంచితే… ఇప్పటికే రెండు సార్లు ప్రధాని అయిన వ్యక్తి.. ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు చెప్పాల్సిన మాటేమిటి? ఓట్లు అడగాల్సిన విధానం ఏమిటి?

తన పాలనలో దేశం ఎక్కడికో దూసుకెళ్లిపోయింది.. అడుగడుగునా అభివృద్ధి కనిపిస్తుంది.. ఎటు చూసినా దేశం మొత్తం వెలిగిపోతుంది.. నా పాలన నచ్చితే బీజేపీకి ఓటు వేయండి.. ఇలాంటి అభివృద్ధిని కాంక్షించేవారంతా కమళానికి మద్దతివ్వండి. అని ప్రజలను ఓట్లు అడగాలి. కానీ… మోడీ చేస్తున్నదేమిటి? దేవుళ్ల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, కులాల కుంపట్లు రేపి.. ఓట్లు అడుక్కునే స్థితికి దిగజారిపోయారు.

ప్రస్తుతం కర్నాటక ఎన్నికల్లో మోడీ చేస్తుంది అదే. రాముడు అని కాసేపు, ఆంజనేయుడు అని మరికాసేపు, హిందుత్వం అని ఇంకాసేపు… కేవలం ఇలాంటి స్లోగన్స్ పైనే మోడీ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఐదేళ్లు బీజేపీ పాలనను కర్ణాటక ప్రజలు చూశారు. మరోసారి అలాంటి పాలనే కావాలనుకుంటే… బీజేపీకి మద్దతివ్వండి అని అనలేకపోతున్నారు. అంటే… పరోక్షంగా తమ పాలనలో ప్రజలు నరకం చూశారని మోడీ చెప్పకనే చెబుతున్నారు.

ఇదే విషయాలపై మోడీ పై కీలక కామెంట్లు చేశారు మాజీ ఐఏఎస్ అధికారి. అవును… దేవుళ్ళు, మతాలపేర్లతో ఓట్లు అడగడం ఇదేమి రాజకీయాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రధాని మోడీని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు “జై బజరంగబలి” అనే నినాదం చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అభివృద్ధి చేసి ఓట్లు అడగాలి కదా అని నిలదీశారు.

ఇదే క్రమంలో దేశంలోని మెజారిటీ మేదావులు, రాజకీయ పండితులు సైతం… మోడీ ఈ స్థితికి దిగజారిపోవడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముతక రాజకీయాలకు మోడీ స్వస్థి చెప్పడం కష్టమని.. ప్రజలే ఆ విషయాని గ్రహించాలని పిలుపునిస్తున్నారు!