ప్రపంచంలో ఎన్నో ప్రత్యేకమైన గణేశ విగ్రహాలు ఉన్నప్పటికీ, ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమో వద్ద ఉన్న గణేశ విగ్రహం మాత్రం అద్భుతమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ విగ్రహం ఒక అగ్నిపర్వతం అంచున ఉండటం విశేషం. 700 సంవత్సరాలుగా టెంగర్ తెగ ప్రజలు దీన్ని తమ గ్రామాల సంరక్షకుడిగా భావించి పూజిస్తున్నారు. భక్తి, జానపద విశ్వాసాలు, ప్రకృతి అందాలు కలిసిపోయి ఈ ప్రదేశాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా నిలబెట్టాయి.
గణేశ చతుర్థి రోజున ఇక్కడ జరిగే వేడుకలు ఎంతో వైభవంగా ఉంటాయి. స్థానికులతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు ఈ ప్రదేశానికి చేరుతారు. సోషల్ మీడియాలో ఈ విగ్రహం ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతాయి. పువ్వులు, పండ్లు, ధూపంతో స్థానికులు చేసే పూజలు ఈ విగ్రహానికి ప్రత్యేకతను తెచ్చిపెడతాయి.
ఇండోనేషియాలో హిందూ సంప్రదాయాల ప్రాధాన్యం చరిత్రపూర్వం నుంచే ఉంది. బ్రహ్మ పేరుని స్మరించుకుంటూ “బ్రోమో” అని పేరు పొందిన ఈ అగ్నిపర్వతం 2,392 మీటర్ల ఎత్తులో ఉంది. దాని చుట్టూ విస్తరించి ఉన్న అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అయితే ఈ విగ్రహం మాత్రం కేవలం సాంస్కృతిక గుర్తింపే కాదు, స్థానికుల కోసం ఒక దైవిక రక్షణగా నిలుస్తోంది. వారు నమ్మే ప్రకారం, గణేశుడి పూజ చేయకపోతే అగ్నిపర్వతం కోపిస్తుందని, అందుకే నిరంతరం భక్తితో ఆరాధన కొనసాగిస్తారు.
మౌంట్ బ్రోమో ఇండోనేషియాలోని 141 అగ్నిపర్వతాలలో ఒకటి. అందులో 130 ఇప్పటికీ చురుకుగా ఉండగా, బ్రోమో తన ప్రత్యేకతతో పేరు పొందింది. ఈ పర్వతం అంచున గణేశ విగ్రహం ఉండటం వలన, ఇది ఒక పర్యాటక కేంద్రమే కాకుండా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మారింది. ఉదయం సూర్యోదయాన్ని వీక్షించడం, అగ్నిపర్వత దృశ్యాలను ఆస్వాదించడం, అలాగే ఈ అరుదైన గణేశ విగ్రహాన్ని దర్శించడం అనేది యాత్రికులకు ఒక విశిష్ట అనుభూతిని అందిస్తుంది.
సురబయలోని జువాండా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కారులో 2–3 గంటల ప్రయాణం చేసి ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఇక్కడి వాతావరణం, స్థానికుల భక్తి, ప్రకృతి సోయగాలు కలిసి మౌంట్ బ్రోమో గణేశ విగ్రహాన్ని ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వం, విశ్వాసం, ప్రకృతిపట్ల గౌరవానికి ప్రతీకగా నిలబెట్టాయి.
