ఉత్తరాదిలో ఎంత ఊపు ఉన్నా దక్షిణాదిలో మాత్రం ఉందా లేదా అనే పరిస్థితి భారతీయ జనతా పార్టీది. నరేంద్ర మోదీ ఒక దఫా పాలనను పూర్తి చేసుకున్నా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా పార్టీని నిలబెట్టలేకపోయారు. ఒక్క కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీకి చెప్పుకోదగిన స్థానం లేదు. ముఖ్యంగా ఏపీలో. ఈ విషయం గత ఎన్నికల్లో సంపూర్ణంగా బయటపడింది. అందుకే కేంద్ర నాయకత్వం ఏపీ శాఖలో కీలక మార్పులకు తెర తీసింది. వాటిలో ప్రధానమైనది అధ్యక్షుడిగా కన్నా లక్ష్నీనారాయణను తొలగించి సోము 3వీర్రాజును నియమించడం. కన్నాకు ఇన్నాళ్ళు టీడీపీ పక్షపాతి అనే పేరుంది. ఆ మచ్చే పార్టీని ఎదగకుండా తొక్కేసింది. ఈ విషయాన్ని అధిష్టానం కొంత ఆలస్యంగానే గుర్తించినా దిద్దుబాటు చర్యలను మాత్రం గట్టిగానే తీసుకుంది.
అంతేకాదు.. బీజేపీలో డామినేట్ చేసే ధోరణి ఎక్కువగా ఉండేది. ఎవరితో చెలిమి చేసినా తమదే పైచేయిగా ఉండాలనే వైఖరి బీజేపీకి ఉండేది. అందువలనే టీడీపీతో వ్యవహారం చెడింది. మిత్రులుగా ఉన్న ఇద్దరూ బద్ద శత్రువులయ్యారు. ఇక తాజాగా పొత్తు కుదుర్చుకున్న జనసేన పార్టీని కూడా అలాగే ట్రీట్ చేశారు. పేరుకి కేంద్ర స్థాయి ఆసక్తితో కుదిరిన స్నేహమే అయినప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ ఆ స్నేహానికి పెద్దగా విలువ ఇచ్చింది లేదు. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు పవన్ కళ్యాణ్ తో రెండు మూడు మీటింగులు తప్ప కలిసి నడిచింది లేదు. పవన్ సైతం ఈ విషయాన్ని త్వరగానే అర్థం చేసుకున్నారు. కానీ నరేంద్ర మోదీ మీదున్న గౌరవం, నమ్మకంతో ముందుకుసాగారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పు కనిపిస్తోంది. తమకూ రాష్ట్రంలో జనాకర్షణ కలిగిన నేత తోడుంటే బాగుంటుందని బీజేపీ గట్టిగా డిసైడ్ అయింది.
Read More : హీరో కాకముందే సూపర్ స్టార్, హీరో అయ్యాకే జీరో !
అందుకే పవన్ పట్ల తీరును మార్చుకున్నారు. ఇంతకు ముందులా కలిసి ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టు కాకుండా నిజంగానే కలిసుండాలని భావిస్తున్నారు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజుకు పూర్తి క్లారిటీని ఇచ్చినట్టుంది అధిష్టానం. అందుకే ఆయన పదవి చేపట్టిన తరువాత జనసేనానితో జరిపిన తొలి సమావేశాన్ని విజయవంతం చేసుకున్నారు. ఈ సమావేశంలో అమరావతి రైతులకు ఎలా న్యాయం చేయాలి, రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులు ఎలా ఖర్చవుతున్నాయి, ఇంకా అనేక సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి జరిగిన చర్చలో ఎవరి సారథ్యంలో కూటమి ముందుకెళ్ళాలి అనే విషయంపై కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సోము వీర్రాజుగారి మాటలు వింటే అర్థమవుతోంది.
Read More : బాలయ్యలో మార్పులు.. స్క్రిప్టులో చేర్పులు !
సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన మోదీగారి ఆలోచనలను ప్రజానీకం దగ్గరకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎలా తీసుకెళ్లాలి అనే విషయమై ఒక్క ప్రణాళక తీసుకుంటాం అంటూ మాట్లాడారు. ఈ మాటలు వీర్రాజుగారు పొరపాటున మాట్లాడిన మాటలు కాదు. చాలా ఖచ్చితంగా చెప్పిన మాటలు. ఈ మాటల్ని బట్టి పవన్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అర్థమవుతోంది. అంటే ఇకపై కూటమి పవన్ సారథ్యంలో నడవనుందన్న సంకేతాలు ఇచ్చినట్టుంది. మోదీగారికి మొదటి నుండి పవన్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. 2014 ఎన్నికలప్పుడు కూడా టీడీపీ, బీజేపీ, జనసేనలు కూటమిగా ఉన్నప్పుడు చంద్రబాబు పట్ల మోదీ దృష్టి రాజకీయ కోణంలో మాత్రమే ఉంటే పవన్ పట్ల మాత్రం ప్రత్యేకంగా ఉండేది. జనసేనానికి కూడా మోదీ నాయకత్వ సామర్థ్యం, ఆలోచనల మీద అమితమైన నమ్మకం ఈరోజు ఉంది.
ఈ పరస్పర విశ్వాసమే కూటమి పగ్గాలను మోదీ పవన్ చేతికి ఇవ్వాలని అనుకునేలా ప్రభావితం చేసి ఉండొచ్చు. బీజేపీ దృష్టిలో పవన్ ప్రాముఖ్యత పెరిగింది అనడానికి తాజాగా కేంద్రం రూపొందించిన నూతన విద్యా విధానంలో పవన్ సూచనలను పరిగణలోకి తీసుకోవడం. ఇక నాయకత్వం పవన్ చేతికి ఇస్తే రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబుచ్చుకుంటారనే సమస్య కూడ ఇక్కడ లేదు. ఎందుకంటే సోము వీర్రాజు, పవన్ మధ్యన మంచి సాన్నిహిత్యం ఉంది. కన్నా లక్ష్మీనారాయణ కంటే వీర్రాజు వద్దే పవన్ కు చనువు ఎక్కువ. వీర్రాజుగారికి సైతం పవన్ అంటే నమ్మకం ఉంది. అన్నిటికీ మించి ఆయన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి కేంద్ర నాయకత్వం ఎలా చెప్తే అలా నడుచుకునే వ్యక్తి. కనుక కేంద్రం పవన్ మీద ఎక్కువ ఆసక్తి చూపితే ఆయనేం అభద్రతా భావం పెంచుకోరు. సో.. ప్రజెంట్ పొత్తులో పరిస్థితులన్నీ పవన్ కళ్యాణ్ సారథ్యం కోరుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి.