MLA Yarlagadda Venkatrao: “కోడిగుడ్డు కాదు, గూగుల్: వైజాగ్ పారిశ్రామిక విప్లవంపై వైసీపీకి ఎమ్మెల్యే యార్లగడ్డ చురకలు”

వైసీపీ ఐదేళ్ల పాలనలో కేవలం ‘కోడి గుడ్డు’ను మాత్రమే తీసుకొస్తే, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ‘గూగుల్‌’ను తీసుకొచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)పై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం రూ. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.

బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, “గత మూడు రోజులుగా వైసీపీ నాయకులు ప్రెస్‌మీట్‌లు పెట్టి ఏమాత్రం స్పష్టంగా మాట్లాడటం లేదు. వారి మాటలను ఒకసారి శాంతంగా చూసి, రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అక్టోబర్ 14, 2025 ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చారిత్రాత్మక రోజు” అని అన్నారు.

దేశంలోనే అతిపెద్ద పెట్టుబడిపై విమర్శలేంటి?
గూగుల్ సంస్థ రూ. 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ హబ్‌ని స్థాపించేందుకు కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ. 3,22,000 కోట్లు ఉంటే, ఐదేళ్లలో సగటు రాష్ట్ర ఆదాయానికి వచ్చే మొత్తం రూ. 32,000 కోట్లు వంటి పెద్ద అంకెలకు చేరుతుందని పేర్కొన్నారు. “ఇలాంటి పెట్టుబడిని దేశంలో మొట్టమొదటిసారిగా గొప్ప స్థాయిలో ఆకర్షించడం విషయంలో కొందరు విమర్శలు ఎలా చేయగలుగుతున్నారు?” అని ప్రశ్నించారు.

దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే, ఇలాంటి గూగుల్ డేటా హబ్ ఆంధ్రప్రదేశ్‌కు రావడం పట్ల చాలా రాష్ట్రాలు బాధపడుతున్నాయని, కానీ రాష్ట్రానికి వచ్చిన ఈ ప్రాజెక్టును వైసీపీ విమర్శించడం బాధాకరమని అన్నారు. “మనకి ఏదైనా తెలియకపోతే గూగుల్ చేస్తాం. డేటా ఇస్తే తీసుకుంటాం. అటువంటి గూగుల్ మన రాష్ట్రానికి వస్తే ఊరు, పేరు లేని కంపెనీ వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు?” అని నిలదీశారు.

20 లక్షల ఉద్యోగాలను అడ్డుకునే ప్రయత్నమా?
తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేశ్ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే, దానిని అడ్డుకోవాలనే దుష్ట ప్రయత్నాలే వైసీపీలో కనిపిస్తున్నాయని వెంకట్రావు ఆరోపించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తే వైసీపీకి మనుగడ ఉండదనే అనుమానంతోనే ఇలా మాట్లాడటం సరికాదన్నారు. “ఈ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చినప్పుడు మీరు నోరు మూసుకుని, ‘వెల్‌కమ్ టూ ఏపీ గూగుల్’ అని బోర్డు చూపిస్తే ప్రజలు సంతోషించేవారు. దానికి బదులుగా కాకి గోల చేస్తున్నారని” విమర్శించారు.

గూగుల్‌పై కోపమా? కడప మాజీ ఎంపీ కేసు భయమా?
“అభివృద్ధి చెందటం మీకు ఇష్టం లేదా, లేక కడప మాజీ ఎంపీ కేసులో గూగుల్ టెక్ అవుట్ ద్వారా సమాచారం సేకరిస్తారనే భయంతో గూగుల్‌పై మీకేమైనా కోపం ఉందా?” అని యార్లగడ్డ వెంకట్రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి గూగుల్ సంస్థ వస్తుందంటే ప్రజలు గర్వపడే పరిస్థితి ఉందని, కానీ వైసీపీ విమర్శలను చూస్తుంటే వారికి సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) అర్థం కావట్లేదని భావిస్తున్నామన్నారు. టెక్నాలజీ తెలిస్తే, మంగళవారం గూగుల్ క్లౌడ్‌లో ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడాన్ని స్వాగతించేవారని అన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో కొత్త శకం నిన్నటి నుంచే ప్రారంభమైందని ఆయన తెలిపారు.

Google Data Center: విశాఖను ఏఐ హబ్‌గా మార్చేందుకు కీలక ముందడుగు

‘గూగుల్ ఏపీ’ ట్రెండింగ్ అయినా వారికి అర్థం కావట్లేదు
గూగుల్ రోజువారి ఆదాయం $1.07 బిలియన్ డాలర్లు అని, అలాంటి సంస్థ ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తే దేశవ్యాప్తంగా ‘గూగుల్ ఏపీ’ ట్రెండింగ్ అయిందని, కానీ వైసీపీ వారికి ఇది అర్థం కావట్లేదని వెంకట్రావు విమర్శించారు. అతి తక్కువ వయస్సు గల రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ పెట్టుబడి కేవలం $4.4 బిలియన్లు మాత్రమేనని, దాని ద్వారా 48,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటిది గూగుల్ సంస్థ $15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందంటే 1.5 లక్షల నుంచి 1.9 లక్షల ఉద్యోగాలు వస్తాయని అర్థం చేసుకోవాలని సూచించారు.

గూగుల్ హబ్ ‘గేమ్ ఛేంజర్’
విశాఖలో గూగుల్ హబ్ రాకతో అభివృద్ధి జరుగుతుందని, ఇది ఆంధ్రప్రదేశ్‌కు ‘గేమ్ ఛేంజర్‌’గా మారబోతుందని యార్లగడ్డ అభివర్ణించారు. 1998లో చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్‌కు తీసుకొచ్చినప్పుడు తక్కువ మంది ఉద్యోగులు ఉండేవారని, ఇప్పుడు దేశవ్యాప్తంగా 25 వేల ఉద్యోగాలు ఉంటే, హైదరాబాద్ మైక్రోసాఫ్ట్‌లోనే 10 వేల ఉద్యోగాలు ఉన్నాయని వివరించారు. మైక్రోసాఫ్ట్ వచ్చాకే హైదరాబాద్‌కు పలు దిగ్గజ కంపెనీలు వరుస కట్టాయని, ప్రస్తుతం దాదాపు 1500 దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు నాటిన మొక్క ఈరోజు మహావృక్షమై తెలంగాణను నడిపిస్తోందని అన్నారు. అదేవిధంగా నేడు ఏపీకి గూగుల్ వచ్చిన తరువాత ఏఐ హబ్ కూడా వచ్చే అవకాశం ఉందని వెంకట్రావు అన్నారు.

వైసీపీ వైఖరిపై డిమాండ్
“మాజీ ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్లు గురించి చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే గత ఐదేళ్ల కాలంలో వైసీపీ రాష్ట్రంలో చేసిందేమిటో అర్థం అవుతోంది” అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వైసీపీ గూగుల్ కంపెనీ రాకను వ్యతిరేకిస్తుందా, స్వాగతిస్తుందా ఒక్క ముక్కలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ‘బొబ్బట్లు, పచ్చళ్లు, అప్పడాల పరిశ్రమలు’ తీసుకువచ్చిన వారికి ఐటీ కంపెనీల విలువ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాని పరిస్థితి ఉంది కాబట్టి కనీసం మీడియా సమావేశం పెట్టి గూగుల్ రాకను స్వాగతించాలని యార్లగడ్డ వెంకట్రావు సూచించారు.

Tarnaka Degree Student Mounika Case | Ambaji Nayak | Hyderabad | Telugu Rajyam