ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మురళీతో కలిసి ఆయన చౌటుప్పల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించి, భవనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ: పాఠశాల భవనాలు దేవాలయాల వలె పవిత్రంగా ఉండాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు. మొదటి దశలో మండల, మున్సిపల్ కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సర్వే చేసి, వాటిని ‘టెన్ ప్లస్ టూ’ (ఇంటర్మీడియట్) స్థాయికి సరిపడేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఒక్క చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే మూడు క్లస్టర్ పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.
నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని, ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతో పాటు, పారిశ్రామికవేత్తల నుంచి సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు సమీకరించి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన గతంలోనూ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుర్వి నర్సింహగౌడ్, బోయ దేవేందర్, బొంగు జంగయ్య, ఉప్పు భద్రయ్య, ఎండీ హన్నూబాయి, బాబా షరీఫ్, దేప రాజు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


