అసెంబ్లీకి వెళ్ళాలని రెండు సార్లు ప్రయత్నించి భంగపడ్డారాయన. లోక్‌సభకు వెళ్ళేందుకోసం ఓ సారి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. తెలంగాణ ఉద్యమంలో ‘అజాతశతృవు’ అనిపించుకోవడం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ, వాస్తవాన్ని కుండబద్దలుగొట్టేస్తారన్న పేరుని సమైక్యవాదుల దృష్టిలోనూ సంపాదించుకున్నారాయన. రఘునందన్‌రావు.. దుబ్బాక ఎమ్మెల్యేగా ఈ రోజు విజయాన్ని అందుకున్న ఈ న్యాయవాది, చట్ట సభకు ఎంపికవ్వాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేసీ చేసి, చివరికి పట్టుదలతో సాధించారు.
రఘునందన్ గెలుపుకోసం.. ఇంతమంది కష్టపడ్డారా.?
రాజకీయాల్లో ‘ఒంటిచేత్తో గెలిపించడం, గెలవడం..’ అనేది చాలా అరుదైన సందర్భం. ఓ విజయంలో చాలామంది పాత్ర వుంటుంది. రఘునందన్ గెలుపులో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. పది మంది పాతిక మంది కాదు.. బోల్డంతమంది కీలక పాత్ర పోషించారు. ఎంపీలు, కేంద్ర మంత్రి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ పెద్ద లీడర్లే. చిత్రమేంటంటే, తెరవెనుక వివిధ పార్టీలకు చెందిన నేతలూ ఆయనకు సహాయ సహకారాలు అందించారు.. రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి. ఆ విషయమై ఇప్పుడు ఆయా పార్టీలు తలపట్టుక్కూర్చుంటున్నాయి.
పోలీసులకు విజయాన్ని అంకితమిచ్చిన ఘనుడు
రఘునందన్ గెలుపులో కీలక పాత్ర పోషించినవారిలో పోలీసులు కూడా వున్నారట. ఆయనే ఈ విషయాన్ని చెప్పారు. జస్ట్ ఇది ఓ పొలిటికల్ సెటైర్ అంతే. ఎప్పుడైతే రఘునందన్ బంధువుల ఇంట్లో డబ్బులు దొరికాయంటూ పోలీసులు హంగామా చేశారో, ఆ తర్వాత దుబ్బాకలో ‘మూడ్’ మారిపోయింది. సింపతీ వేవ్ ఆయనవైపుకి మళ్ళింది. అధికార పార్టీ అత్యుత్సాహం కాస్తా, బీజేపీకి కలిసొచ్చింది. ‘ఆ సంఘటన జరిగి వుండకతే..’ అంటూ టీఆర్‌ఎస్ శ్రేణులు నిట్టూరుస్తున్నాయిప్పుడు.
రఘునందన్, నెక్స్‌ట్ ఏంటీ.!
ఖచ్చితంగా రఘునందన్‌కి బీజేపీలో కీలకమైన స్థానం దక్కబోతోంది. స్థానం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. పెద్ద పదవేనంటూ అప్పుడే సంకేతాలు బయటకు వస్తున్నాయి. మృదు స్వభావి.. అవసరమైతే అగ్రెసివ్‌గా మాట్లాడగలరాయన. పైగా గతంలో సుమారు దశాబ్ద కాలం పాటు టీఆర్‌ఎస్ ముఖ్య నేతల్లో ఒకరిగా వుండి, రాజకీయాల్ని ఔపోసన పట్టారాయె. దాంతో, బీజేపీ తెలంగాణలో భవిష్యత్తులో మరింత బలపడేందుకు రఘునందన్‌ని తురుపుముక్కగా బీజేపీ అధిష్టానం ఉపయోగించే అవకాశముంటుంది.