“చలో.. చలో.. చలో..” కేంద్రమంత్రి పరుగో పరుగు… నెటిజన్ల కామెంట్స్ వైరల్!

దేశవ్యాప్తంగా రోజు రోజుకీ బీజేపీ ప్రతిష్ట దిగజారిపోతుంది.. దేశవ్యాప్తంగా బీజేపీని అన్ని వర్గాల ప్రజలూ తిరస్కరించుకుంటున్నారు.. మరికొన్ని వర్గాల ప్రజలైతే ఏకంగా అసహ్యించుకుంటున్నారు.. ప్రజలను మీడియానూ చూసి పారిపోయే పరిస్థితికి బీజేపీ నేతలు దిగజారిపోయారు.. అంటూ గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ వేదికగా కామెంట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఈ విషయం నిజమే అని ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిరూపించాయని చెబుతున్న సమయంలో… తాజాగా మరో విషయం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రోజురోజుకీ ఉద్ధృతంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమ పథకాలు గంగానదిలో పారేస్తామని రెజ్లర్లు ప్రకటించారు. అయినా కూడా మోడీ & కో కి చీమ కుట్టినట్లయిన లేదు! అయితే రైతు సంఘాల భరోసాతో రెజ్లర్లు ఆ పనిని వాయిదా వేసుకున్నారు. ఈ సమయంలో తాజాగా కేంద్రంలో 9ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ ఢిలీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పెట్టిన పరుగులు ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.

అవును… రెజ్లర్లు చేపట్టిన ఆందోళనపై కేంద్రమంత్రి మీనాక్షి లేఖిని విలేకరులు ప్రశ్నించారు. మీ స్పందన ఏమిటో చెప్పాలని వెంటపడ్డారు. దీంతో సమాధానం చెప్పలేక పరుగు లంకించుకున్నారు కేంద్రమంత్రి. ఇలా చీర కొంగు చేతపట్టి, మెడలో బీజేపీ కండువా పట్టి మీనాక్షి లేఖి పరుగెడుతుండగా… విలేకరులు కూడా ఆమెను అనుసరించారు. దీంతో.. తన సిబ్బందితో.. “చలో.. చలో.. చలో” అంటూ తన కారు వద్దకు పరిగెత్తుకుని వెళ్లిపోయారు కేంద్రమంత్రి మీనాక్షి!

ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుండగా… “మీరు పరిగెట్టడం కాదు.. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తరిమి తరిమి కొడతారంటూ” కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!