కవిత ఏ పార్టీలో ఉంది..? టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్..!

తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్లు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం చారిత్రకమని అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఏం మేలు చేసిందో సమాజం చూస్తుందని తేల్చేశారు.

తాము కుల సర్వే చేపట్టామని.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఇవన్నీ విప్లవాత్మక నిర్ణయాలని తెలిపారు. కానీ ఇవన్నీ తాము సాధించిన విజయమని కవిత చెప్పుకుంటున్నారంటే అది హాస్యాస్పదమని తెలిపారు. కవిత గారు తీహార్ జైలులో ఉన్నప్పుడు తాము ఈ ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు. అప్పట్లో ఆమె బీసీల కోసం ఎక్కడ పోరాటం చేశారు.. ఎవరూ చూడలేదు అంటూ విమర్శించారు.

‘‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం సాధించమని చెప్పుకున్న కవిత.. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను తన విజయంగా చెప్పుకోవడం విస్మయం కలిగిస్తోందని. కవిత ఏ పార్టీకి చెందినవారో కూడా ఇప్పుడు వాళ్లకే క్లారిటీ లేదేమో, అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మహేశ్ కుమార్. అంతేకాదు, బీసీలకు మేలు చేసే విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీసం అభినందన మాట కూడా పలకలేదని ధ్వజమెత్తారు. ‘‘ఎన్నో సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కేంద్రం ఈ బిల్లుపై ఇంకా స్పందించలేదు. బీజేపీకి బీసీలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి అసలు లేదు’’ అని విమర్శించారు.

‘‘తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెరిగితే అది కచ్చితంగా కాంగ్రెస్ కృషి ఫలితమన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా తమకు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసినా ప్రజలు నిజం తెలుసుకుంటారు అని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం ఇప్పుడు అన్ని చూస్తోందని, మోసపోని పరిస్థితి ఏ పార్టీకి లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.