గ్రేటర్ హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి పెత్తనం ఎంటి. ఎక్కడో కొడంగల్ నుంచి నిన్నకాక మొన్న హైదరాబాద్ వచ్చి పెత్తనం చేస్తే తామంతా చూస్తూ ఊరుకోవాలా. కొడంగల్ లో ఓడిపోయిన దిక్కులేని స్థితిలో హైదరాబాద్ వచ్చి ఎంపీగా గెలిస్తే తామంతా ఆయన కింద పనిచేయాలా అని గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. రేవంత్ రెడ్డి స్పీడ్ ను జీర్ణించుకోలేకపోతున్న మర్రిశశిధర్ రెడ్డి, వి.హనుమంతరావు, బిక్షపతి యాదవ్, ముకేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి లు రేవంత్ రెడ్డి పై ఫైర్ అవుతున్నారు. సికింద్రబాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తప్ప మిగతా నేతలంతా రేవంత్ జోరుకు బ్రేకులు వేసేందుకు పావులు కదుపుతున్నారంటా. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే పీసీసీ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు రేవంత్ రెడ్డిపై మండిపడ్డారంటా. రేవంత్ రెడ్డి కూడా అంతే ధీటుగా బదులిచ్చారంటా.
నిన్న మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి మళ్లీ జోరు పెంచారు. గ్రేటర్ ఎన్నికలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని దాదాపు సగం డివిజన్లు తన మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోకి రావడంతో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తగిన నాయకత్వం లేకపోవడంతో స్థానిక నేతలతో రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడుతున్నారంటా. ఈ
పరిణామాలను స్థానిక నేతలు జీర్ణించుకోలేక … లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు.
ఈ ఆరోపణలను రేవంత్ రెడ్డి వర్గం కొట్టి పారేస్తోంది. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని ఇచ్చేందుకు తమ వద్ద పక్కా ప్యూహరచన ఉందని వాదిస్తోంది. అయితే గ్రేటర్ ఎన్నికల బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పగించకపోయినా ఆయన ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని మిగతా నేతలు ప్రశ్నిస్తున్నారు. మరీ అంతగా పనిచేయాలని అనుకుంటే ముందు
పీసీసీని సంద్రదించి ఆతర్వాత మిగతా సీనియర్ నేతలందరినీ సంప్రదించాలని వాదిస్తున్నారు. అలా కాకుండా నేరుగా స్థానిక నేతలతో మాట్లాడితే ఇక తామంతా ఎందుకు ఉన్నట్లని ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలను సాకుగా చూపి స్థానిక నేతలందరినీ తన కంట్రోల్ లోకి తీసుకుని తమని డమ్మీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇలా గ్రేటర్ ఎన్నికల హడావిడి ప్రారంభం కాకముందు కాంగ్రెస్ పార్టీలో కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఓ వైపు నాయకత్వ లేమికి తోడు ఉన్న నాయకత్వంలో కీచులాటల కారణంగా రానున్న గ్రేటర్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.