ఆరోగ్యకరమైన జీవనశైలికి అనేకమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగే అలవాటు చేసుకుంటూ ఉంటారు. బరువు తగ్గుతుందని, శరీరాన్ని టాక్సిన్స్ నుంచి శుభ్రం చేస్తుందని నమ్ముతున్నారు. కానీ వైద్య నిపుణులు చెబుతున్న తాజా వివరాలు మాత్రం ఈ అలవాటు శరీరానికి ముప్పు అని చెబుతున్నారు. నిమ్మకాయలో ఉండే అధిక ఆమ్లత్వం ఖాళీ కడుపుతో తాగినప్పుడు శరీరంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎముకలలోని కొవ్వును తగ్గించి వాటిని బలహీనపరచడంతో.. వయసు పెరిగేకొద్దీ ఎముకల సమస్యలు తలెత్తేలా చేస్తుందని అంటున్నారు.
అదేవిధంగా నిమ్మరసంలోని ఆమ్లం దంతాల ఎనామిల్‌ను దెబ్బతీసి, దంతాలు సున్నితమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇక ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఆస్కార్బిక్ ఆమ్లం అధికంగా మూత్ర విసర్జనకు దారితీస్తుంది. దీని ఫలితంగా శరీరంలో నీరసం, డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే అవకాశముంది. మూత్రపిండాలపై ఒత్తిడి పెరగడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా రాక తప్పదని నిపుణులు చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వల్ల కడుపులో అధిక ఆమ్ల ఉత్పత్తి జరుగుతుంది. దీంతో గుండెల్లో మంట, వికారం, గ్యాస్, కడుపు మంట వంటి ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి సందర్భాల్లో శరీరానికి మేలు చేయాలనుకుంటూ తీసుకునే నిమ్మరసం, చివరికి హానికరం కావొచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నిపుణులు చెబుతున్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నిమ్మరసం తాగే సరైన సమయం. ఖాళీ కడుపుతో కాకుండా భోజనం చేసిన తర్వాత నిమ్మరసం తీసుకుంటే శరీరానికి హానికరం కాకుండా మేలు చేస్తుందని చెబుతున్నారు.
అయితే పరిమిత మోతాదులో మాత్రమే తీసుకుంటే దానివల్ల జీర్ణక్రియ మెరుగవ్వడం, శరీరానికి తేలికగా అనిపించడం వంటి లాభాలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నిమ్మరసం తాగే సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా అవసరం. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలను గుర్తుంచుకోవడం ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
