మనలో ప్రతి ఒక్కరి కల ఒకటే మన ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నిలవాలని. అయితే దానికి కేవలం కోరికలు ఉంటే చాలదు.. పూజలు, నియమాలు, పరిశుభ్రతతో కూడిన జీవనశైలి ఉండాలి. పండితులు చెబుతున్న కొన్ని ఆచారాలను మనం పాటిస్తే, ఇంట్లో సానుకూల శక్తులు వర్ధిల్లి, లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ మన వెంట ఉంటుంది.
ముఖ్యంగా ఇంట్లో నిత్యం పూజకు సిద్ధం చేసుకునే ముందు శుభ్రత అత్యంత ముఖ్యమని నమ్మకం. ప్రతిరోజూ దీపాన్ని శుభ్రం చేసి వెలిగించడం వలన ఇంటి పవిత్రత నిలుస్తుందని చెబుతారు. పూజా మందిరం శుభ్రం చేసే సమయంలో దేవతా చిత్రాలను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. వాటిని శుభ్రమైన వస్త్రంపై ఉంచడమే సముచితం. అలాగే పూజ పూర్తయ్యాక పూజ గది తెరను ఎల్లప్పుడూ కిందికి దించటం శ్రేయస్కరమని పెద్దలు చెబుతుంటారు.
ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. దీని వలన వాస్తు దోషాలు తొలగిపోతాయని, ప్రతికూల శక్తులు దూరమవుతాయని విశ్వసిస్తారు. అంతేకాక, ఇంట్లో పరిశుభ్రత లేకపోతే పేదరికం దాపురిస్తుందని, శుభ్రతతో కూడిన ఇల్లు అయితే లక్ష్మీదేవి నిలువుతుందని పురాణాల్లో స్పష్టమైన ప్రస్తావన ఉంది.
లక్ష్మి కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పెట్టాలని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే తులసి వృక్షంలో లక్ష్మి నిలుస్తుందని నమ్మకం. దీపం వెలిగించడం, తులసి మొక్కను పూజించడం కలిపి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని చెబుతారు.
అదే సమయంలో దానధర్మాలు జీవితాన్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. వారానికి ఒకసారి పేదలకు ఆహారం పెట్టడం, బట్టలు దానం చేయడం అత్యంత శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. దానాల వల్ల మన పుణ్యం పెరుగుతుందని, కష్టసమయంలో దేవుని కటాక్షం మరింత బలంగా మనతో ఉంటుందని పెద్దలు చెబుతారు.
ఆహారపు అలవాట్లు కూడా లక్ష్మి నిలవడానికి ప్రభావం చూపుతాయి. ప్రతిరోజూ సాత్విక ఆహారం తినడం శ్రేయస్కరమని, మాంసాహారం ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
లక్ష్మి నిలవాలంటే కేవలం పూజలు చాలవు.. భక్తి, నియమం, పరిశుభ్రత అన్నీ సమంగా పాటించాలి. ప్రతిరోజూ లక్ష్మి దేవి మంత్రాలను జపించడం, శ్రీ సూక్తం, కనకధార స్తోత్రం లేదా లక్ష్మీ చాలీసా పఠించడం ఇంట్లో సంపద, శ్రేయస్సు, ఆనందాన్ని ఆకర్షిస్తాయని చెబుతున్నారు. ఈ ఆచారాలను జీవితంలో అలవాటు చేసుకున్నవారి ఇల్లు ఎల్లప్పుడూ సంతోషం, సంపద, సానుకూలతలతో నిండిపోతుందని పెద్దలు విశ్వాసంతో చెబుతున్నారు. నిజానికి, లక్ష్మి దేవి నిలవడం అనేది కేవలం ధనం మాత్రమే కాదు.. ఆరోగ్యం, శాంతి, ఆనందం అన్నీ కలిపి ఉండటమేనని పండితులు చెబుతున్నారు.
