చంద్రబాబుకు తన రాజకీయజీవితంలో కనీవినీ ఎరుగని పెద్ద షాక్ ఇచ్చారు కుప్పం నియోజకవర్గ ఓటర్లు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పుడే రెండు మూడు రౌండ్ల లెక్కింపులో ఆయన వెనుకబడి పరాజయం తప్పదేమో అనిపించింది. ఆ తరువాత కొంచెం పుంజుకుని ముప్ఫయివేల అతి తక్కువ ఓట్ల ఆధిక్యతతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బయటపడ్డారు. అప్పటినుంచి ఆయన పతనం కొనసాగుతూనే ఉందని నిన్న మూడో విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. కుప్పం లోని మొత్తం 89 పంచాయితీలకు గాను 75 పంచాయితీలను వైసిపి మద్దతుదారులు కైవసం చేసుకున్నారంటే చంద్రబాబును ప్రజలు ఇక సహించే పరిస్థితిలో లేరని అర్ధం అవుతుంది. అంతకన్నా చెప్పుకోదగిన మరొక షాక్ ఏమిటంటే, కేవలం కొద్ది వందల ఓట్లు మాత్రమే పోలయ్యే ఈ ఎన్నికల్లో అనేకచోట్ల టిడిపి మద్దతుదారులకు డిపాజిట్లు కూడా గల్లంతు కావడం!
ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవని చెప్పుకోవడం షరా మామూలే అయినా పల్లెల్లో ఎవరు ఏ పార్టీ మద్దతుదారులో అందరికీ తెలుస్తుంది. అయితే ఒక గ్రామంలో నివసించేవారు కాబట్టి ఘర్షణలు జరగవు. కానీ గెలిచినవారెవరో, ఓడినవారెవరో అందరికీ తెలుస్తుంది. పార్టీ గుర్తులు లేవుకదా..గెలిచినవారంతా మావారే అని చెప్పుకోవడం సులభమే అయినప్పటికీ ఏ పంచాయితీలో ఎవరి గుప్పెట్లో ఉంటుందో ఆయా గ్రామజనులకు తెలియకుండా ఉంటుందా? ఏ రకంగా చూసినా మూడున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో తెలుగుదేశం ఓటమి అంటే ఆ పార్టీ కూసాలు కదులుతున్నట్లే లెక్క.
మూడో విడత ఫలితాల్లో తోలి రెండు విడతల్లాగే అధికారపార్టీ విజయఢంకా మ్రోగించింది. ఇంకో చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే రాజధాని ప్రాంతంగా చెప్పుకుంటున్న గుంటూరు జిల్లా మొత్తాన్ని వైసిపి ఊడ్చిపారేసింది. తెలుగుదేశం మద్దతుదారులకు కేవలం మూడు పంచాయితీలు మాత్రమే దక్కాయంటే ఆ పార్టీని ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారో తెలుసుకోవచ్చు. తెలుగుదేశం స్పాన్సర్ చేస్తున్న రాజధాని ఉద్యమం ప్రభావం ఈ ఎన్నికలలో అణుమాత్రం కూడా ప్రతిఫలించలేదు. ఆ ఉద్యమం రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆక్రందనలే తప్ప ప్రజలెవ్వరికీ రాజధాని మీద ఆసక్తి లేదని, రాజధాని పేరుతో చంద్రబాబు దోచుకున్నాడని భావిస్తున్నట్లుగా ఈ ఎన్నికల ఫలితాలకు భాష్యం చెప్పుకోవాలి. కృష్ణా జిల్లాలో మాత్రమే తెలుగుదేశం పార్టీకి కొద్దో గొప్పో పంచాయితీలు దక్కాయి. పాలనారాజధాని కాబోతున్న విశాఖపట్నం లోనూ వైసీపీయే విజయదుందుభి మ్రోగించింది.
మొత్తంగా చూస్తే ఎనభై అయిదు శాతానికి పైగా స్థానాలను దక్కించుకున్న వైసిపి మూడో విడతలోనూ తనదే ఆధిక్యం అని చాటుకుంది. మొదటి రెండు విడతలకన్నా మూడోవిడతలో తెలుగుదేశం పార్టీ మరింతగా దిగజారిపోయి ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నది. ఈ ఎన్నికలు లోకేష్ నాయుడు భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కూడా చాటి చెప్పాయి. తాతగారు స్థాపించిన పార్టీ మనుమడి చేతిలో సమాధి అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వైసిపి ఇంతటి ప్రభంజనాన్ని సృష్టించడానికి కారణాలు ఏమిటి? కేవలం జగన్మోహన్ రెడ్డి నిజాయితీ, విశ్వసనీయత, నిష్పక్షపాతంగా సంక్షేమపథకాల అమలు, పరిపాలనను గ్రామీణస్థాయికి తీసుకెళ్లడం, వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, ఇతర సంస్కరణలు. పైగా డాబులు, దర్పాలు ప్రదర్శించకపోవడం, సొంత ప్రచారానికి ఎక్కువ విలువ ఇవ్వకపోవడం కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో అభిమానాన్ని పెంచాయి. పార్టీల పరంగా జరగబోయే మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే హవాను వైసిపి కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు
Kuppam, Kuppam constituency, voters ,Kuppam , Chandrababu, nara Chandrababu, tdp, ap panchyat elections,