Komatireddy Venkat Reddy Warns: పవన్‌కు కోమటిరెడ్డి మాస్ వార్నింగ్: క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వం!

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన “కోనసీమ దిష్టి” వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

సినిమాలు విడుదల కానివ్వం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “పవన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. లేదంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. తెలంగాణలోని ఒక్క థియేటర్‌లో కూడా ఆయన సినిమా విడుదల కానివ్వం,” అని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్ర పాలకుల పాపమే ఫ్లోరైడ్ తెలంగాణ ప్రజల దిష్టి వల్లే గోదావరి జిల్లాలు దెబ్బతిన్నాయన్న పవన్ వ్యాఖ్యలను కోమటిరెడ్డి తిప్పికొట్టారు. “తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కాదు.. గత ఆంధ్ర పాలకుల వల్లే ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగి ఇబ్బందులు పడ్డారు. చరిత్ర, వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ మాట్లాడటం సరికాదు,” అని హితవు పలికారు.

రాజకీయ అనుభవం లేదు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చిరంజీవి గారు సూపర్ స్టార్, ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ, పవన్ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేనట్లుంది. అందుకే పరిణితి లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు,” అని అభిప్రాయపడ్డారు.

అసలేం జరిగిందంటే? ఇటీవల గోదావరి జిల్లాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్.. అక్కడి పచ్చదనం చూసి ఓర్వలేకే ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టారని వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతల దిష్టి తగలడం వల్లే గోదావరి జిల్లాల్లోని కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి.

Telangana Leaders Fire On Pawan Kalyan Konaseema Comments || Ap Public Talk || Ys Jagan || TR