Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ హిందువులను, హిందూ దేవుళ్లను అవమానించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ కూడా ‘హిందుగాళ్లు-బొందుగాళ్లు’ అంటూ మాట్లాడి ప్రజల నుంచి ఏ రకమైన తీర్పు పొందారో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.
రైతులకో న్యాయం.. పారిశ్రామికవేత్తలకో న్యాయమా? రాష్ట్రంలో రైతులకు ఒక న్యాయం, పారిశ్రామికవేత్తలకు మరో న్యాయం అమలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించి, పారిశ్రామికవేత్తలకే పెద్దపీట వేస్తోందని విమర్శించారు. హిల్ట్ (HILLT) పాలసీని హడావుడిగా తీసుకురావడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు.

హైదరాబాద్‌ను మరో బెంగళూరులా మారుస్తారా? నగరంలో ఇప్పటికే అనేక మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు హిల్ట్ పేరుతో 9 వేల ఎకరాల్లో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే భవిష్యత్తులో తలెత్తే పరిణామాలను సీఎం అంచనా వేశారా అని ప్రశ్నించారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల కారణంగా పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా అదే దుస్థితికి తీసుకురావాలని చూస్తున్నారా అని నిలదీశారు.
గతంలో తానే ఏకైక మేధావినని కేసీఆర్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో మరో మేధావి తయారయ్యారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

