KIMS Hospital: హతఃవిధీ… ఉన్న పరువు కాస్తా తీసేసిన కిమ్స్!

KIMS Hospital: ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ (పీపీపీ) విషయంలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా… ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి తాము ఎలాంటి టెండర్లు దాఖలు చేయలేదని, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం తప్పని కిమ్స్ యాజమాన్యం చెప్పింది! ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి!

తాజాగా సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. కిమ్స్ టెండర్ విషయంలో ముందుకు వెళ్లాలంటూ మంత్రికి సూచించినట్లు వచ్చిన వార్తలు అబద్ధమా..?

ప్రభుత్వం, ప్రధానంగా చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్న వైద్య రంగంలో పీపీపీ విధానం కోసం తొలివిడతలో నాలుగు కాలేజీల పేర్లు ప్రకటిస్తే.. సంస్థల నుంచి ఒక్క టెండర్ కూడా రాకపోవడాన్ని ఎలా చూడాలి..?

ఇది కూటమి ప్రభుత్వానికి అత్యంత అవమానమైన ఘటన అనే కామెంట్లను పెద్దలు పరిగణలోకి తీసుకుంటారా..?

ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ డాక్టర్ వ్యక్తిగతంగా వేసిన టెండర్ ను కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం వేసినట్లు చెప్పడంలో ఎవరి నిర్లక్ష్యం, ఎవరి అలసత్వం దాగి ఉంది..?

ఈ విషయంలో అధికారులు మంత్రిని మోసం చేస్తే.. మంత్రి ముఖ్యమంత్రిని ఏమార్చితే.. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను మాయ చేశారనుకోవాలా..?

ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని కాసేపు, పీపీపీ విధానం వల్ల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని మరి కాసేపు చెబుతూ.. ఏదో విధంగా మెడికల్ కాలేజీలను ప‌బ్లిక్ ప్రైవేట్ పార్టన‌ర్‌ షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొద‌టి విడ‌త‌లో భాగంగా… పులివెందుల తోపాటు ఆదోని, మార్కాపురం, మ‌ద‌న‌ప‌ల్లె మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు టెండ‌ర్లు పిలిచిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో… కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీకి.. హైదరాబాద్ కు చెందిన కిమ్స్ సంస్థ మాత్రమే టెండర్ వేసింది. ఇక మిగిలిన మూడు కాలేజీలకు కనీసం టెండర్లు వేయడానికి కూడ ఏ ఒక్క సంస్థా ముందుకు రాలేదు. దీంతో ఇది కూటమి ప్రభుత్వానికి చాలా అవమానం అనే కామెంట్లు వినిపించాయి. సరేలే.. కనీసం ఒక్క కాలేజీకి అయినా టెండర్లు వచ్చాయి.. గుడ్డిలో మెళ్ల అని సరిపెట్టుకుందామని భావించిన వారికి మరో బిగ్ షాక్ తగిలింది!

ఇందులో భాగంగా… ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి తాము ఎలాంటి టెండర్లు దాఖలు చేయలేదని కిమ్స్ యాజమాన్యం చెప్పింది. నాలుగు మెడికల్ కాలేజీల కోసం టెండర్లు పిలిచిన సమయంలో, ఆదోని మెడికల్ కాలేజ్‌కు ఒక్కటే టెండర్ వచ్చిందని ప్రభుత్వం చెప్పడాన్ని కిమ్స్ ఖండించింది! టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం తప్పని స్పష్టం చేసింది. ఈ అసత్య ప్రచారాన్ని తప్పుబట్టింది.

ఈ సందర్భంగా స్పందించిన మంత్రి సత్య కుమార్… కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్‌ గా పనిచేస్తున్న ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ రావడంతో, అది కిమ్స్ ఆసుపత్రి వేసిన టెండర్‌ గా భావించామని పేర్కొన్నారు. అయితే ఇది కేవలం ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే.. అది కమ్యునికేషన్ గ్యాప్.. అది కూడా చిన్న కమ్యునికేషన్ గ్యాప్ అని సత్యకుమార్ అనుకున్నా.. దీనివల్ల కూటమి పరువు మరింతగా పోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఈ నేపథ్యంలో ఈ వార్తను ఎలా తిప్పి తిప్పి రాయాలి.. ఎలా తిప్పి తిప్పి ప్రజెంట్ చేయాలి.. కూటమి పరువు పోలేదు అనే విషయాన్ని ఎంత నున్నగా చెప్పాలి అనే ప్రయత్నంలో ఓ వర్గం మీడియా ఉందనే చర్చ ఈ సందర్భంగా మొదలైంది! మరోవైపు… టెండర్ ల ప్రక్రియలో ఇకపై చివరి తేదీ ఉండకపోవచ్చని.. ఎవరు ఎప్పుడు వచ్చినా డోర్లు తెరిచే ఉండే అవకాశం ఉందని అంటున్నారు!! మరి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పీపీపీ విధానం ఏ విధంగా కొలిక్కి వస్తుందో వేచి చూడాలి!

చంద్రబాబు స్కిల్ కేసు రి ఓపెన్ || Journalist Bharadwaj About Chandrababu Skill Development Case ||TR