మొదటిసారి ఈడీ విచారణకు బాగానే వెళ్లివచ్చేసిన కవిత.. రెండోసారి రమ్మంటే మాత్రం రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు! కోర్టుకి వెళ్తున్నారు.. లాయర్ తో ఫైల్స్ పంపిస్తున్నారు.. ఆరోగ్యం బాగాలేదంటూ మెయిల్స్ పెడుతున్నారు.. ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందంటూ విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగా సుప్రీంకు వెళ్లిన కవితకు ఎదురుదెబ్బ తగిలింది.
అవును… ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ ఆఫీసుకు మహిళను పిలిపించి విచారణ చేయడంపై దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా పరిష్కారించాలన్న కవిత అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 24వ తేదీనే విచారిస్తామని సృష్టం చేసింది.
ఫైతంగా.. సుప్రీంకోర్టు చెప్పినట్లు నడుచుకుంటానని నిన్నటివరకూ ప్రకటించిన కవితకు ఇప్పుడు ఆ ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో… ఈనెల 20న రెండోసారి విచారణకు హాజరు కావాలని కవితకు పంపిన నోటీసులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోర్టు ఈ నెల 24వరకూ జోక్యం చేసుకోదు కాబట్టి… “విచారణకు భయపడేది లేదు” అని, “తెలంగాణ తలవంచదు” అని 20న కవిత విచారణకు హాజరవుతారా? లేక మరో ఆలోచన చేస్తారా అన్నది వేచి చూడాలి!
కాగా… ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత రెండో దఫాలో విచారణకు గైర్హాజరయ్యారు. అనారోగ్యంతోపాటు సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు రాలేకపోతున్నట్టుగా పేర్కొన్నారు. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే!