ఈడీ అధికారులను ఎదురుప్రశ్నిస్తున్న కవిత!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 20వ తేదీ సోమవారం ఈడీ ముందు రెండోసారి విచారణకు హాజరైన కవితను ఈడీ అధికారులు సుమారు 11గంటల పాటు విచారించారు. ఈ సుధీర్ఘ విచారణలో.. కవితను ఈడీ అధికారులు ప్రశ్నించడమే కాదు… కవిత కూడా కొన్ని సార్లు ఈడీ అధికారులను ఎదురు ప్రశ్నించారంట!

సోమవారం న్యూఢిల్లీలో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు 11 గంటల పాటు ప్రశ్నించారు. అయితే ఈ సమయంలో ఆమెను ఎక్కువసేపు ఒంటరిగా, ఖాళీగానే ఉంచారని తెలుస్తోంది. ఈ క్రమంలో… ఈడీ అధికారులను కవిత ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

మీరు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నన్ను విచారణ చేస్తున్నది నిజమా కాదా? ఈ విధంగా ఎంత మంది రాజకీయ నాయకులను వేధిస్తారు? రాజకీయ నాయకులపై పెట్టిన కేసుల్లో ఎన్నింటిని మీరు రుజువు చేయగల్గుతున్నారు? గతంలో విపక్షంలో ఉండి ఇప్పుడు బీజేపీలో చేరిన సుజనా చౌదరి, హిమంత బిశ్వశర్మ, నారాయణ్‌ రాణె పై ఈడీ పెట్టిన కేసులు ఏమయ్యాయి? నన్ను నిందితురాలిగా భావిస్తున్నారా? వంటి ప్రశ్నలను ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులపై సంధించారని.. అయితే కవిత వేసిన ఏ ఒక్క ప్రశ్నకూ ఈడీ అధికారులు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు బీఆరెస్స్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం బీఆరెస్స్ వర్గాలు చెప్పిన ఈ మాటలు వైరల్ గా మారాయి!

అయితే… కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఈడీ అధికరులు మౌనంగా ఉన్నారా… లేక, ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కోసం మిమ్మల్ని తీసుకొచ్చాం.. మీరు అడిగిన ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పడానికి కాదు అనే డైలాగ్ ని మనసులో అనుకుని మౌనంగా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది!

కాగా… సోమవారం జరిగిన 11 గంటల విచారణలో ఈడీ అధికారులు కవితకు 14 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా అనుకున్నటుగా.. అరుణ్‌ పిళ్లైతో కవిత ముఖాముఖీ విచారణ జరగలేదని సమాచారం. కవిత, పిళ్లైని ఈడీ అధికారులు విడివిడిగానే విచారించినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత బయటకొచ్చిన కవిత అభిమానులకు విజయచిహ్నం చూపిస్తూ , చిరునవ్వు చిందించారు.