చంద్రబాబు వెన్నుపోటి ఏ స్థాయిలో ఉంటుందో కాసాని జ్ఞానేశ్వర్ ఫస్ట్ టైం రుచి చూశారు.. మనసులో ఒకటిపెట్టుకుని, పైకి ఎలాంటి అనుమానం రాకుండా అద్భుతంగా నటించడంలో చంద్రబాబు గొప్ప నటుడు.. ఏపీలో పవన్ కల్యాణ్ కేడర్ ని టీడీపీకి అమ్మేస్తుంటే, తెలంగాణలో కేడర్ ను చంద్రబాబు కాంగ్రెస్ కు తాకట్టు పెడుతున్నారు.. ఇలాంటి కామెంట్లు ప్రస్తుతం తెలంగాణ టీడీపీ నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ చర్చనీయాంశమయ్యాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం… తెలంగాణ ఎన్నికల్లో పోటీకి గైర్హాజరవ్వాలని బాబు నిర్ణయించడమే!
ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలు ఉంటే ఎంత పోతే ఎంత.. పైగా అలాంటి పార్టీలో ఏ నాయకుడైనా ఎందుకు ఉంటాడు.. మరోపార్టీకి మేలు చేయాలని, సొంత పార్టీ నేతలను గొంతు కోసి, కేడర్ ను తాకట్టుపెట్టడం ఎలాంటి రాజకీయంగా చూడాలి.. ఈ రేంజ్ లో ఫైరవుతున్నారు కాసాని జ్ఞానేశ్వర్. దీంతో… తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. సాధారణంగా నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తుంటారు కానీ… రొటీన్ కి భిన్నంగా తెలంగాణ టీడీపీకి… ఆ పార్టీ అధ్యక్షుడే రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నానంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు కాసాని జ్ఞానేశ్వర్ తన రాజీనామా లేఖను పంపించారు. ఇందులో భాగంగా… తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడం తనకు తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ తీసుకున్న నిర్ణయం తనతోపాటు పార్టీ శ్రేణులందరికీ తీవ్ర మనోవేధనకు గురిచేస్తోందని లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు ఎన్నికల్లో పోటీకి దిగి, పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపి, సర్వశక్తులూ ఒడ్డాల్సిన సమయం ఇది. అలాంటి కీలక సమయంలో… ఎన్నికల బరినుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం సహేతుకమైంది కాదు అని కాసాని కుండబద్దలు కొట్టారు. ప్రధాన పార్టీలైన బీఆరెస్స్, కాంగ్రెస్, బీజేపీలను పక్కనపెడితే… వామపక్షాలు, బీఎస్పీ, జనసేన వంటి చిన్నా చితకా పార్టీలు కూడా పోటీచేస్తున్న సమయంలో… 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఇలా పలాయనం చెత్తగించడం అనైతికమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో… పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఈ కష్టకాలంలో తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమైన నాయకులకు కనీసం బీఫాంలు ఇప్పించలేని ఈ పదవిలో ఉండటం సముచితం కాదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపిన ఆయన… టీడీపీ అధినాకత్వం తీసుకున్న తాజా నిర్ణయం బీసీ, అణగారిన వర్గాల నాయకత్వాన్ని నమ్మించి గొంతుకోసే విధంగా ఉందని భావిస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అది చంద్రబాబుకే సాధ్యం అన్నట్లుగా పరోక్షంగా చెప్పినంత పనిచేశారని అంటున్నారు!
ఇదే సమయంలో… వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రయోజనాలకోసం, తెలంగాణలో ఇతర పార్టీల గెలుపుకోసం పార్టీ కేడర్ ను లోపాయకారీగా తాకట్టుపెట్టడం అనైతికమని తెలిపిన కాసాని… పార్టీ అధినేతగా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసేలా తాజాగా తీసుకున్న నిర్ణయంతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
మరిముఖ్యంగా… తెలంగాణలో మరో పార్టీని గెలిపించడం కోసం సొంతపార్టీ నేతల గొంతు కోయడం, కేడర్ ను తాకట్టు పెట్టడం వంటి అనైతిక చర్యలకు తాను మనస్థాపం చెందినట్లుగా కాసాని జ్ఞానేశ్వర్ లేవనెత్తిన అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఫలితంగా.. చంద్రబాబు ఏ పార్టీ మేలు కోరి టీడీపీ నాయకులకు, కేడర్ కు వెన్నుపోటు పొడిచారో వారికి ఈ ఎఫెక్ట్ గట్టిగా తగిలే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు.