తెలంగాణ ఎన్నికలకు బై బై… కాసాని కారెక్కుతారా?

చంద్రబాబుతో ములాకత్ అనంతరం అంతన్నాడు ఇంతన్నాడు కాసాని జ్ఞానేశ్వర్! తనవరకైతే 199 స్థానాల్లోనూ పోటీచేయాలనే ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో కంటే తెలంగాణలోనే టీడీపీకి బాగుంటుందని అన్నారు. కొన్ని చోట్ల టీడీపీ టిక్కెట్ కోసం ముగ్గురేసి నాయకులు పోటీ పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతలోనే… తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోవాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకుంది!

దీంతో… చంద్ర‌బాబుతో ములాఖ‌త్ తర్వాత మీడియాతో టీటీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ చెప్పిన విష‌యాల‌న్నీ ప్ర‌గ‌ల్భాలే త‌ప్ప‌, అందులో వాస్త‌వాలు లేవ‌ని తేలిపోయింది. ఇందులో భాగంగా.. స్కిల్ స్కాం కేసులో చంద్ర‌బాబు అరెస్ట్‌, వైసీపీ ప్ర‌భుత్వంపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న క్ర‌మంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించ‌లేమ‌ని టీడీపీ అధిష్టానం చెప్పుకొస్తుంది. తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేసి, ఘోర ప‌రాజ‌యం పాలైతే.. ఆ ప్ర‌భావం ఏపీపై ప‌డుతుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

అయితే ఈ నిర్ణయం ఇప్పుడు ప్రకటించినప్పటికీ… ఎప్పుడో తీసుకున్నదే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఉన్న టీడీపీ ఓట్లు వృధా అయిపోవడం తప్ప… టీడీపీ పోటీ వల్ల ఒనగూరే ప్రయోజనం ఉండదని.. పోటీ చేయనిపక్షంలో అవి కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉందని, ఆ విషయంలో రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు సూచించారని అంటున్నారు. ఇదే సమయంలో… జనసేన, బీజేపీతో పొత్తులో వెళ్తున్న నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా చేసే ప్రచారం కూడా టీడీపీకే నష్టం అనే ఆలోచనకు వచ్చారని తెలుస్తుంది.

అయితే ఈ విషయం ముందుగానే ప్రకటించడం కంటే.. ఎన్నికలు దగ్గరైనప్పుడు ప్రకటించాలనే ఆలోచనకు వారు వచ్చారని.. అందుకే ఇన్ని రోజులూ ప్రజలను, కార్యకర్తలనూ ఏమార్చారని చెబుతున్నారు. అయితే… కాసానికి ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్న సమయంలో… ఆయన టీడీపీ అధిష్టాణంఅపై ఒత్తిడి తెచ్చారని.. దీంతో ఈ విషయం ముందుగానే వెల్లడించాల్సిన పరిష్తితి నెలకొందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే… ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ దారెటు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. కారణం… కాసాని కోసం కార్ డోర్ తీసి బీఆరెస్స్ ఎదురు చూస్తుంటే… చెయ్యి చాపి కాంగ్రెస్ ఎదురు చూస్తుందని చెబుతున్నారు. మరి ఈ విషయంలో కాసాని.. కారెక్కుతారా.. లేక, చేతిలో చేయ్యి వేస్తారా అనేది వేచి చూడాలి. ఈ విషయంపై కూడా ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.