సోమవారం అరుదైన మూడు యోగాలు.. శివకేశవులను ఇలా పూజించాలి..!

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశులలో కామిక ఏకాదశికి ఒక విశిష్ట స్థానం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇది ఈసారి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. దీనికి కారణం.. జూలై 21, సోమవారం రోజున మూడు అరుదైన శుభ యోగాలు ఒకేసారి ఏర్పడనున్నాయి. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ రోజున వృద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కలసి ఏర్పడడం వల్ల అది సాధారణ ఏకాదశి రోజుకి మించి శక్తివంతమవుతుంది. ఈ కారణంగా ఆ రోజు పూజలు, వ్రతాలు, దోష పరిహారాలు చేస్తే శతగుణ ఫలితాలు కలుస్తాయని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం కామిక ఏకాదశి రోజున పరమేశ్వరుని పూజించటం అత్యంత శ్రేయస్కరమని చెబుతారు. సోమవారం రోజే ఏకాదశి రావడం వల్ల మరింత మంగళప్రదం. వృద్ధి యోగం కొత్త ఆరంభాలకు, ఆర్థిక అభివృద్ధికి దారి చూపిస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. సర్వార్థ సిద్ధి యోగం కోరిన కోరికలు నెరవేరడానికి, ప్రతి పనిలో విజయాన్ని అందించడానికి ఎంతో శ్రేయస్కరమని నిపుణులు పేర్కొన్నారు. అమృత సిద్ధి యోగం అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ యోగం కలిగినప్పుడు చేసే దానాలు, పూజలు, వ్రతాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా శుభ ఫలితాలను ప్రసాదిస్తాయని చెబుతున్నారు.

ఈ రోజు పరమేశ్వరుని పూజకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శివలింగానికి అభిషేకం చేయడం, బిల్వ పత్రాలు సమర్పించడం, ఓం నమః శివాయ… అనే మంత్రాన్ని ఎక్కువసార్లు జపించడం విశేషమైన శాంతి, శక్తి ఇస్తుందని నమ్మకం. రుద్రాక్ష్టకం, శివ చాలీసా, మహామృత్యుంజయ మంత్రం పఠించడం కూడా శరీర ఆరోగ్యానికి, మనశ్శాంతికి దోహదం చేస్తుంది.

కేవలం శివ పూజతోనే కాకుండా, ఏకాదశి రోజు కావడంతో లక్ష్మీనారాయణుడి పూజ కూడా తప్పనిసరిగా చేయాలని పండితులు చెప్పుతున్నారు. ఆ రోజున ఉదయం సూర్యోదయం కంటే ముందే తలస్నానం చేసి శుభ్రతతో పూజ చేయాలి. ఇల్లు, పూజామందిరం పరిశుభ్రంగా ఉంచి విష్ణుమూర్తి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఎర్రని వస్త్రంపై బియ్యంపై ప్రతిష్టించి పూజించడం శుభప్రదం. శ్రీహరికి తులసి దళాలను సమర్పించడం, పంచామృతాభిషేకం చేయడం, పసుపు, చందనం అర్చన చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని పెద్దలు అంటున్నారు.

కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉపవాసం కొనసాగించాలి, మరుసటి రోజు ద్వాదశి రోజున మాత్రమే ఉపవాసం విరమించాలి. ఉపవాసం విరమించే ముందు బ్రాహ్మణులకు స్వయంపాకం చేసి దానం ఇవ్వడం వల్ల పుణ్యఫలాలు కలుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పసుపు రంగు వస్తువులను, ధాన్యాన్ని, బియ్యాన్ని, బట్టలను దానం చేయడం వల్ల దోషాలు తొలగి, ఆస్తి ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.

జూలై 21 రోజున ఏర్పడనున్న ఈ మూడు యోగాలు ఒక్కోసారి ఒకే రోజున కలిసిరావడం చాలా అరుదు. అందుకే పండితులు ఈ సమయాన్ని వృథా చేయకుండా శివారాధనతో పాటు శ్రీహరి పూజ కూడా చేసి, దానం ధర్మం చేయమని పునపునా సూచిస్తున్నారు. ఈ పవిత్ర రోజున ఆరాధన, జపం, దానం చేస్తే ఒక్కరికి కాదు, సమస్త కుటుంబానికి కూడా శ్రేయస్సు కచ్చితంగా లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు ఈ ప్రత్యేక కామిక ఏకాదశిని సాధ్యమైనంతగా ఉపవాసం, పూజలు, దానం ద్వారా సద్వినియోగం చేసుకుని, ఇల్లు, కుటుంబం సుఖసంతోషాలతో నిండేలా ఆశీర్వాదాలను పొందాలని పెద్దలు సూచిస్తున్నారు.