JanaSena Leaders: దున్నపోతు ఈనింది అంటే దూడను దొడ్లో కట్టేయండి అన్న సామెతలాగా తయారయ్యింది ఇటీవల ఓ వర్గం మీడియా పరిస్థితి అనే కామెంట్లు ఇటీవల విపరీతంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ తప్పుడు పనికి పూనుకున్న వ్యక్తిని తొలుత వైసీపీ కార్యకర్త అని ప్రచారం జరగడంతో పోలీసులు అతనికి భారీ ట్రీట్ మెంట్ ఇచ్చారని.. తీరా ఆ తర్వాత కానీ అతడు జనసేన కార్యకర్త అని, పవన్ కల్యాణ్ కు హార్డ్ కోర్ ఫ్యాన్ అని తేలిందని అంటున్నారు! దీంతో.. పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి!
నేరం చేశారని ఫిర్యాదు అందితే ఆ వ్యక్తి ఎవరైనా సరే అతని విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే సంకేతాలు ఇవ్వాలి కానీ.. వాళ్లకు పార్టీల గుర్తింపు జతచేయడం ఎందుకు..?
పోనీ.. మనిషన్నవాడు తప్పు చేయడం సహజం.. అలాగే మీడియా కూడా పొరపాటు చేసిందనుకుందాం.. అలాంటప్పుడు సవరణ వార్త వేయాలన్న సంస్కారం లేకపోతే ఎలా..?
పోనీ.. ఏ రాజకీయ పార్టీకి చెందిన బడా నేతలో.. పెద్ద పెద్ద లీడర్లో అయితే వారి ఐడెంటిటీని పార్టీతో కలిపి చెప్పినా తప్పు లేదు.. ఎందుకంటే అదే వాళ్ల కెరీర్ కాబట్టి! కానీ.. యువకులకు అలా ట్యాగ్స్ తగిలించి, వారి జీవితాలను ఇబ్బందుల్లో పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం..?
శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో ఆదివారం ఓ గర్భిణిపై అజయ్ దేవ్ అనే ఓ వ్యక్తి దాడి చేశాడు. దీంతో అతడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సమయంలో అతన్ని కదిరి రోడ్లపై నడిపించుకుంటూ పోలీసుస్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ విషయం స్థానికంగా వైరల్ గా మారింది.
ఈ విషయంపై స్పందించిన కదిరి డీఎస్పీ.. తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో 21న రాత్రి మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గర్భిణి సంధ్యారాణి ఇంటివద్ద వైసీపీ కార్యకర్తలు కేకలు వేస్తూ బాణసంచా కాల్చారని.. ఆ శబ్దాలు భరించలేక ఆమె బయటకు వచ్చి కాస్త దూరంగా కాల్చాలని చెప్పారని.. దీనిపై ఆగ్రహించిన అజయ్ దేవ్ ఆమె కడుపుపై తన్నాడని తెలిపారు.
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు మంగళవారం నిందితుడిని కదిరి-మదనపల్లె ప్రధాన రహదారిపై బీటీ క్రాస్ వద్ద అరెస్టుచేసి కదిరికి తీసుకొచ్చారు. ఆర్టీసీ బస్టాండు నుంచి పోలీసుస్టేషన్ వరకు చెప్పులు లేకుండా ఉత్త కాళ్లతో నడిపించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించేందుకే ఇలా చేసినట్లు డీఎస్పీ చెప్పారు.

అయితే… ఈ విషయంలో అజయ్ దేవ్ కు “వైసీపీ కార్యకర్త” అనే ట్యాగ్ తగిలించింది ఓ వర్గం మీడియా! పోలీసులు కూడా అదే విషయాన్ని చెప్పారు! దీంతో… ప్రభుత్వ పెద్దల సలహాలు సూచనలతో అతడు నిజంగా వైసీపీ కార్యకర్తేమో అని భావించిన పోలీసులు తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ పెద్దల మన్నలను పొందజూశారని చెబుతున్నారు!!
కట్ చేస్తే… నిందితుడు అజయ్ జనసేనకు చెందిన వ్యక్తి అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్ బహిరంగంగా అంగీకరించిన పరిస్థితి. ఇదే సమయంలో అజయ్ కి వైసీపీకి సంబంధం లేదని.. అతని చేతిపై పవన్ కల్యాణ్ పచ్చబొట్టు కూడా ఉందని మరింత క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు… ఏదైనా ఘటన జరిగిన వెంటనే నిందితులను వైసీపీ కార్యకర్తలుగా.. ఏమాత్రం బాధ్యత లేని ఓ వర్గం మీడియా, పోలీసులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిందితుడు అజయ్ పై ఫిర్యాదు చేసిన గర్భిణీ.. ఇతనికి బంధువులని.. తన తండ్రిని తిట్టిందన్న కోపంతో ఆమెను అజయ్ తోసేశాడని స్థానికులు చెబుతున్నారని అంటున్నారు!
ఏది ఏమైనా అతడు ఓ గర్భిణీ స్త్రీపై చేయి చేసుకోవడం తప్పు.. ఆమెపై భౌతిక దాడి ఏమాత్రం క్షమార్హం కాదు. అతడికి పోలీసులు ఇచ్చారని చెబుతున్న ట్రీట్ మెంట్ నూ ఎవరూ ఆపేక్షించేదీ ఉండకపోవచ్చు. కానీ.. అతడిని ఓ నిందితుడిగా చూడకుండా… కనీసం నిజం ఏంటో తెలియకుండా.. వైసీపీ కార్యకర్త అని ట్యాగ్ తగిలించి ప్రచారం చేయడం నిజంగా నీచపు జర్నలిజం లోకి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

