కేసీఆర్ కూతురుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కవిత పొలిటికల్ కెరీర్… ఢిల్లీ లిక్కర్ స్కాం కు ముందు – తర్వాత గా మారిపోయిందనే చెప్పాలి. ఈ స్కాం కేసులో ఈడీ విచారణలతో మరింత రాటుదేలడంతోపాటు.. బీజేపీ సర్కార్ పై పీకల్లోతు కోపాన్ని పెంచేసుకున్నట్లున్నారు కవిత! ఇందులో భాగంగా.. బీజేపీ పేరెత్తినా – మోడీ నామస్మరణ చేసినా… ఆమె అంతెత్తున లేస్తున్నారు. అయితే… ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత.. పార్లమెంటులో తన వాయిస్ వినిపించాలని ఫిక్సయ్యారట!
అవును… వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని ఫిక్సయిన కవిత… ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా… తనను ఓడించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను ఈ దఫా చిత్తు చిత్తు చేయాలని బలంగా భావిస్తున్నారంట. జాతీయస్థాయిలో తన వాయిస్ ని వినిపించాలంటే… ఎంపీగా గెలవడం అత్యవసరం అని కవిత భావిస్తున్నారట. అందుకే తాజాగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది.
ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై కాన్సంట్రేషన్ చేసిన కవిత… పార్లమెంట్ పరిధిలో వరుస సమావేశాలతో రాజకీయంగా కాకరేపుతున్నారట. ఇందులో భాగంగా… నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లోనూ పాల్గోవడంతోపాటు… వెళ్లిన ప్రతీచోటా… కేడర్ కు నేనున్నాంటూ భరోసానిస్తున్నారు.
అవును… తాజాగా జగిత్యాలలో బీఆరెస్స్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని కేడర్ ను కవిత… అనంతరం జరగబోయే ఆర్మూర్, భోదన్, మెట్ పల్లి సహా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, ఫలితంగా కేడర్ ను ఒక్కటి చేయాలని ప్లాన్ చేస్తున్నారట! ఫలితంగా ఈసారి అర్వింద్ ని గట్టిగా కొట్టాలని, పార్లమెంట్ లో గ్రాండ్ గా అడుగుపెట్టాలని భావిస్తున్నారన్నమాట.
ఇదే క్రమంలో… కవితకు జాతీయ రాజకీయాల్లోనూ కీలక బాధ్యతలను కేసీఆర్ అప్పగించారని.. ఆమెను ఎంపీగా గెలిపించి, ఢిల్లీలో కీరోల్ పోషించేలా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్… రాబోయే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగా గెలవాలని చెప్పారంట. దీంతో… కవిత మరింత దూకుడు పెంచారని అంటున్నారు!
కాగా, గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయినప్పటి నుంచి రాజకీయంగా ఏడాది పాటు సైలెంట్ గా ఉన్న కవిత… ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించి మండలిలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.