తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం భారతీయ జనతా పార్టీ పదునైన వ్యూహాలతో ముందుకు వెళుతోంది. పార్టీకి తెలంగాణలో హైప్ తీసుకురావడంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా చేసిన కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
కానీ, అనూహ్యంగా బండి సంజయ్‌ని కాదని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ అధినాయకత్వం నియమించింది. ఇక, అక్కడి నుంచి కిషన్ రెడ్డి తన ఉనికిని చాటుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేయక తప్పడంలేదు.
తాజాగా, సినీ నటి జయసుధను బీజేపీలోకి తీసుకొచ్చారు గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఎన్నికల్లో పోటీ చేశారు.. ఎమ్మెల్యేగా గెలిచారు కూడా.! ఆ తర్వాత ఆమె కొన్నాళ్ళపాటు వైసీపీలో కూడా వున్నారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె దూరంగా వుంటూ వస్తున్నారు.
బీజేపీ ఆహ్వానం మేరకు జయసుధ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ లేదా లోక్ సభ.. ఏదో ఒక స్థానం నుంచి (గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో) విజయశాంతి పోటీ చేస్తారంటూ బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజేపీలో చేరడం ఆనందంగా వుందనీ, తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని జయసుధ చెప్పడంలో వింతేముంది.? అన్నట్టు, బీజేపీలో విజయశాంతి రూపంలో సినీ గ్లామర్ ఇప్పటికే వుంది. అన్నట్టు, మరో సినీ నటి జీవిత కూడా బీజేపీలోనే వున్నారు.
అయితే, హిందుత్వ ముద్ర వున్న బీజేపీలో, ‘క్రిస్టియానిటీ’కి బ్రాండ్ అంబాసిడర్‌గా చాలామంది భావించే జయసుధ చేరడం.. నిజంగానే పెద్ద నిర్ణయం అనుకోవాలేమో.!