తెలంగాణ రాజకీయాల్లో జనసేన పాత్ర ఏంటి.?

తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షని జనసేన పార్టీ నెరవేరుస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దానర్థమేంటి.? తెలంగాణలో అధికారంలోకి రావాలని జనసేన పార్టీ అనుకుంటోందా.?

ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలనే అనుకుంటుంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే, తెలంగాణలో జనసేన పార్టీకి పెద్దగా సీన్ లేదు. 2019 ఎన్నికలతోనే అది ప్రూవ్ అయ్యింది.

అయితే, ప్రతిసారీ ఏప రాజకీయాల్లో అక్కడి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, తెలంగాణ సమాజం గురించి ప్రస్తావన తెస్తుంటారు జనసేనాని. తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష వుండడం వల్లే, తెలంగాణ ఉద్యమం విజయ తీరాలకు చేరిందనీ, ప్రత్యేక హోదా ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదనీ చెబుతుంటారాయన.

‘ఏపీ రాజకీయాలు వదిలేసి, తెలంగాణకు వచ్చేయమని తెలంగాణలో చాలామంది తనను అడుగుతుంటారు’ అని కూడా జనసేనాని చెప్పడం చూశాం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పాత్ర ఎలా వుండబోతోంది.? అంటే, దాదాపు 30 సీట్లలో పోటీ చేసేంతలా.!

ఆయా నియోజకవర్గాలకుగాను, జనసేన పార్టీ ఇన్‌ఛార్జిలనూ ఖరారు చేశారు జనసేనాని. ‘మీ మీ నియోజకవర్గాల్లో బలంగా పని చేయండి.. పొత్తులు పెట్టుకోవాల్సి వస్తే, ఎలా.? ఏంటి.? అన్నది నేను ఆలోచిస్తాను..’ అని చెప్పారు జనసేనాని.

ఇంతకీ, ఏపీలో ఇలా ఇన్‌ఛార్జిల నియామకం, నాయకులకు ధైర్యం చెప్పడం వంటివేమైనా సరిగ్గా జరుగుతున్నాయా.? ఈ విషయమై జనసేనాని ఆత్మవిమర్శ చేసుకోవాలి.