రాజకీయాల్లో కురువృద్ధుడు అనదగ్గ పొలిటీషియన్ జానారెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జానారెడ్డి, ఒకప్పుడు ‘పవర్ సెంటర్’గా వుండేవారు. కానీ, మారిన ఈక్వేషన్స్ నేపథ్యంలో జానారెడ్డిని కాంగ్రెస్‌లోనే ఎవరూ పట్టించుకోని పరిస్థితి. నిజానికి, ముఖ్యమంత్రి అవ్వాల్సిన స్థాయి ఆయనకు వుంది. కానీ, రాజకీయంగా చేసిన కొన్ని తప్పిదాలు, జానారెడ్డిని వెనక్కి నెట్టేశాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే వున్నా, ఆ పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఈ సీనియర్ పొలిటీషియన్. జానారెడ్డి పార్టీ మారబోతున్నారహో.. అంటూ ప్రచారం జరుగుతున్న వేళ, ఎట్టకేలకు జానారెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని స్పష్టం చేశారు. ‘నేనెందుకు పార్టీ మారతాను.?’ అంటూ అమాయకంగా ప్రశ్నించేశారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారా.?
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జానారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అకాల మరణం చెందడంతో, ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరైంది. ఈ నేపథ్యంలోనే జానారెడ్డి పేరు మళ్ళీ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. జానారెడ్డితో బీజేపీ అధినాయకత్వం సంప్రదింపులు జరుపుతోందన్న ఉహాగానాల కారణంగా, ఈ కాంగ్రెస్ సీనియర్ నేత గురించి మీడియాలో ఎడా పెడా చర్చలు జరిగేస్తున్నాయి. ‘తూచ్, అదంతా ఉత్తదే’ అని జానారెడ్డి తనయుడు ఇటీవల తన తండ్రిపై వస్తున్న పుకార్లను కొట్టి పారేశారు.
సీఎం అభ్యర్థిని.. నేనెందుకు పార్టీ మారతాను.?
జానారెడ్డి తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించేసుకున్నారు. ‘నేను సీఎం అభ్యర్థిని. నేనెందుకు పార్టీ మారతాను.? బీజేపీలోకి వెళ్ళే ఆలోచనే లేదు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి అధిష్టానానికి నేను ఏం చెప్పాలో అది చెప్పాను. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరుండాలన్నదానిపై నా లెక్కలు నాకున్నాయ్..’ అంటూ జానారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో దారుణ పరాభవం నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. దాంతో, పీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సిన అగత్యం ఏర్పడింది కాంగ్రెస్ అధిష్టానానికి.
ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సుందా రెడ్డిగారూ.!
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా జానారెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ, కాంగ్రెస్‌లో కొన్ని శక్తులు ఆయనకు అడ్డం పడ్డాయి. అంతే, ఆ తర్వాత జానారెడ్డి రాజకీయ జీవితం.. అత్యంత దయనీయంగా తయారైంది. సమీప భవిష్యత్తులో జానారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలే లేవు. కానీ, ‘నేను సీఎం అభ్యర్థిని’ అనే భ్రమల్లోనే కాలం వెల్లదీసేస్తున్నారు జానారెడ్డి.