సుమారు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో హరిజనులు, క్రైస్తవులు గ్రామానికి దూరంగా వేరు వేరు పల్లెల్లో నివాసం ఉండేవారు. గ్రామంలో కేవలం అగ్రవర్ణాలవారు మాత్రమే నివసించేవారు. హరిజనులు, క్రైస్తవులు గ్రామంలోని బావుల్లో మంచినీరు కూడా ఉపయోగించకూడదు అనే ఆంక్షలు ఉండేవి. కానీ, ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆ దురాచారాన్ని నిరసించి గ్రామానికి దూరంగా జీవించే వారికి కూడా గ్రామంలోనే స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కూడా కట్టించుకునే అవకాశం కల్పించారు.
హరిజన గిరిజన ఉద్ధారకులు అని మనం పూజించే నాయకుల కన్నా ఎన్టీఆర్ వారికోసం చేసిన సేవ, వారి ఉద్ధరణకు తెచ్చిన సంస్కరణలు మహోన్నతమైనవి. ఎన్టీఆర్ తీసుకున్న అలాంటి విప్లవాత్మక చర్యల ఫలితంగా కొన్ని కులాహంకార గ్రామాల్లో నిమ్నవర్గాలు అని చెప్పుకునే వారిపై దాడులు జరిగాయి. పాశవిక హత్యలు జరిగాయి. ఎన్టీఆర్ ఒక్కసారిగా తెచ్చిన మార్పులను అగ్రవర్ణాలవారు జీర్ణించుకోలేకపోయారు. తరాలు మారేకొద్దీ ఇపుడు అలాంటి సాంఘిక దురాచారాలకు అడ్డుకట్ట పడింది. మనుషులు అందరూ ఒక్కటే అన్న సమభావన నెలకొన్నది. అన్ని కులాలవారికి అవకాశాలు దక్కుతున్నాయి. అక్కడక్కడా ఒకటిరెండు సంఘటనలు జరుగుతుంటే జరగొచ్చు కానీ అంటరానితనం అనేది పూర్తిగా సమసిపోయింది. ఇది మా కళ్ళముందు జరిగిన గొప్ప మార్పు.
కులం పేరుతో మనుషుల మధ్య అడ్డుగోడలు
అమరావతి అనే ఒక చంద్రబాబు సృష్టించిన భ్రమరావతిలో కులమతాలకు అతీతంగా ఆర్ధికంగా వెనుకబడిన పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామని, ఇళ్ళు కట్టిస్తామని ముఖ్యమంత్రి, ఆధునికతరం ప్రతినిధి అయినట్టి జగన్మోహన్ రెడ్డి ఒక వినూత్న సంస్కరణలకు, బీదాసాదా జనోద్ధరణకు నడుము బిగించి సంకల్పిస్తే దాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం, బీజేపీ లాంటి పార్టీలు న్యాయస్థానాలకు వెళ్లడం విచిత్రం. అందుకు వారు చెప్పిన కారణాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అందరికీ ఇళ్లస్థలాలు ఇస్తే అమరావతి నగరిలో కులపరమైన సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు ఎక్కారు అని తెలిసి నేను తీవ్రవిషాదానికి గురయ్యాను. నిన్న సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని సభాముఖంగా పంచుకోవడం చూసి మనం ఏ కాలంలో ఉన్నామో తెలియక ఆవేదన, ఆందోళన కలిగాయి.
కులాహంకార నగ్న ప్రదర్శన
చంద్రబాబు విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆయన తన సామాజికవర్గం వారికోసం ఒక త్రిశంకుస్వర్గాన్ని సృష్టించాలని కుతంత్రం పన్నారు. ఆకాశహర్మ్యాలు, విహారకేంద్రాలు, పెద్ద పెద్ద విలాసకేంద్రాలు, అయిదు నక్షత్రాల హోటళ్లతో అమరావతి మొత్తాన్ని నింపేసి కేవలం తన కులం వారు మాత్రమే అక్కడ నివసించగలిగేలా, తద్వారా మిగిలిన పన్నెండు జిల్లాల వారు సృష్టించే సంపదను తెచ్చి అమరావతిలో కుమ్మరించి తన కులస్తులను కులీనులుగా, కుబేరులుగా తయారుచేసి జీవితాంతం నారా వంశం వారు మాత్రమే రాష్ట్రాన్ని పాలించేవిధంగా తయారుచేసే కుట్రలు రచించారు. వారి అహంకారం ఎంత దూరం వెళ్లిందంటే, నాటి ప్రతిపక్షనేత అమరావతిలో నడిచిన వీధులను పసుపు నీటి ట్యాంకర్లతో అక్కడివారు శుద్ధి చేశారు. వారి దుర్మార్గాలకు, దురన్యాయానికి అంతకన్నా ఘోరమైన దృష్టాంతం మరొకటి లేదు. విచిత్రంగా ఈ ఆధునిక యుగంలో అలాంటి అమానుష చర్యలు తగవు అని న్యాయస్థానం హితవు పలకలేదు! కానీ చంద్రబాబు దౌర్భాగ్యం ఏమో కానీ, ఆయన భ్రమరావతిలోనే ఆయన దుర్నీతిని వ్రయ్యలు చేశారు ఓటర్లు.
కోర్టు స్టే ఇవ్వడం పరమదుర్మార్గం
బుద్ధిలేని పార్టీలవారు కోర్టులకు ఎక్కారనుకుందాము. న్యాయాన్ని, ధర్మాన్ని అందరికీ సమానంగా సమకూర్చాల్సిన బాధ్యత కలిగిన గౌరవ న్యాయమూర్తులు అలాంటి పిటీషన్లను ఎలా అనుమతించారు? కుల సమతుల్యత దెబ్బతినడం ఏమిటి? అంటే అక్కడ ఒకే కులం వారు నివసించాలా? ఇతర కులాలవారు అక్కడ అడుగు పెట్టకూడదా, ఇల్లు కట్టుకోకూడదా? ఎంత దారుణం! మానవత్వం, మంచి హృదయం కలిగిన ప్రతి ఒక్కరూ నిరసించవలసిన దుష్టచర్య కాదా ఇది! ‘అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు అంతా కలిసి ఉంటేనే రాజధాని అంటారు. అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం.. అందరికీ మంచి చేస్తేనే ప్రభుత్వం అనిపించుకుంటుంది. అటువంటి సమాజం, ప్రభుత్వాన్ని, రాజధానిని దేవుడి దయతో నిర్మిస్తాం’ అని జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించడం ఆయన చిత్తశుద్ధిని మరోసారి బయటపెట్టింది. కేవలం కులం కారణంతో మనుషులను వేరు చేసే అమానుష కార్యాలకు సభ్యసమాజంలో చోటు దక్కరాదు.
గాంధీజీ ఆశయాలను నెరవేర్చుతున్న జగన్
ఇప్పటికైనా న్యాయస్థానాలు కళ్ళు తెరిచి వారు ఇచ్చిన స్టేలు కొట్టేసి ప్రభుత్వ ఆశయాలకు సహకరించి కులరహితమైన మనుష్య సమాజాన్ని నిర్మించాలని ఆశిద్దాం. అగాధమైన జలనిధిలో వేల రకాల జలచరాలు నివసిస్తాయి. ఈ సాగరం మాకోసం మాత్రమే అని తిమింగలాలు, మొసళ్ళు అహంకరించి చిరుచేపలను బయటకు తరిమేస్తాయా? రాజధాని నగరం అయినా, మరే నగరం, పట్టణం, పల్లె అయినా అంతే. గాంధీ మహాత్ముడు కలలు కన్న పల్లెసీమలను సృష్టించడం మహోత్కృష్టమైన కార్యం కదా! గాంధీకి స్వప్నాలను సాకారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అభినందనీయుడు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు