“ఇరవై అయిదుమంది ఎంపీలను నాకు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదాను సాధిస్తాము” అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు పట్ల వ్యతిరేకత కానివ్వండి, జగన్ మీద నమ్మకం కానివ్వండి మూడు సీట్లు మినహా మొత్తం లోక్ సభ స్థానాలు వైకాపాకే కట్టబెట్టారు ఓటర్లు. ఆరుగురు రాజ్యసభ్యులు కూడా ఉన్నారు. అంటే పార్లమెంట్ లో వైకాపాకు ఇరవై ఎనిమిది మంది సభ్యుల బలం ఉన్నట్లు లెక్క.
రాష్ట్రాన్ని చీల్చే ముందు తిరుపతిలో జరిగిన ఎన్నికల సభలో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని వాగ్దానం చేశారు. అదే సభలో మోడీ పక్కన నిలుచున్నా చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ సైతం పదిహేనేళ్ళు కావాలి అంటూ పిడికిళ్లు బిగించారు. చంద్రబాబు అయిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రత్యేకహోదా అన్న పదమే వినిపించలేదు. హోదా అని కొన్ని సార్లు, ప్యాకేజీ అని కొన్నిసార్లు మాటలు మారుస్తూ అయిదేళ్ల కాలం గడిపేశారు. చంద్రబాబు ఓడిపోవడానికి ప్రత్యేకహోదా విషయంలో విఫలం కావడం కూడా కొంత కారణం అయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా కచ్చితంగా వస్తుందని జనం నమ్మారు.
అధికారంలోకి రాకముందు హోదా వస్తే ఎంత లాభమో, ఎన్ని పరిశ్రమలు వస్తాయో వివరించి చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ ఊసే మరిచిపోయారని ప్రజలు విమర్శిస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయి ఉన్నట్లయితే తప్పకుండా హోదాను సాధించేవారమని, కానీ బీజేపీకి పూర్తి ఆధిక్యత రావడంతో ఏమీ చేయలేకపోతున్నామని జగన్ ఇస్తున్న సంజాయిషీ ప్రజలను నమ్మించలేకపోతున్నది. జగన్మోహన్ రెడ్డిలో మునుపటి పోరాటస్వభావం ఇప్పుడు కనిపించడం లేదని, పక్కనున్న కేసీఆర్, రెండు రాష్ట్రాల అవతల ఉన్న పశ్చిమబెంగాల్ ప్రతి విషయంలోనూ కేంద్రాన్ని ధైర్యంగా విమర్శిస్తుంటే జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కేంద్రం భారీ కోతను పెట్టినా జగన్ నోరెత్తి మోడీని విమర్శించలేదంటే ఆయన తన కేసుల గురించి భయపడుతున్నారని ప్రజలు, మేధావులు కూడా సందేహిస్తున్నారు. ప్రస్తుతం జగన్ మీద ఉన్న కేసుల విచారణ వేగవంతం కావడంతో జగన్ గొంతెత్తి కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు.
అటు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన చంద్రబాబు అసలు ఏమీ పట్టనట్లే కూర్చోవడం, ఒక్క అమరావతిని పట్టుకుని వేలాడటం, మోడీని పన్నెత్తి విమర్శించకపోవడం చూస్తుంటే తనమీదున్న స్టేలు తొలిగి తన మీద కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశిస్తుందేమో అని ఆయన భయపడుతున్నారు. అందువల్లే కేంద్రం ఎంత అన్యాయం చేసినా, జగన్ ను విమర్శిస్తున్నారు తప్ప మోడీని ఒక్క మాట అనడానికి కూడా ఆయన భయపడుతున్నారు.
ప్రభుత్వ నేత, ప్రతిపక్షనేత కేసులకు భయపడుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ప్రజలు బాధపడుతున్నారు. బీజేపీ కూడా కేసులను బూచిగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేస్తున్నదని ప్రజలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకన్నా వెనకబడుతుందని ఆందోళన చెందుతున్నారు. కేంద్రంతో సత్సంబంధాల పేరుతో కేంద్రానికి సరెండర్ కావడం అంటే అది ప్రజలకు ద్రోహం చెయ్యడమే అని జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి అని హెచ్చరిస్తున్నారు.