టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ తో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ర్ట వ్యాప్తంగా అచ్చెన్న అరెస్ట్ సంచలనం సృష్టించింది. వైకాపా సర్కార్ సరిగ్గా మాటేసి ఎటాక్ చేయించడంతో ప్రతిపక్ష పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. అవినీతి తిమింగలాలు ఈ రోజు కాకపోతే ఏదో రోజు దొరుకుతాయన్న చందంగా అచ్చెన్న అడ్డంగా బుక్కయ్యారు. ఈఎస్ఐ స్కాంలో భారీ కుంభకోణానికి తెర దీసినట్లు ఏసీబీ అధికారులు తేల్చి కోర్టులో హాజరు పరిచారు. ఇక ఉదయం నుంచి అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలోనే జరుగుతోంది.
తప్పు చేసారు కాబట్టి అరెస్ట్ అయ్యారని అధికార పక్షం అంటుంటే..అక్రమ కేసులు బనాయించి సీబీఐ అధికార పక్షానికి కొమ్ముకాసేలా చేసి అరెస్ట్ చేయించారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా నగరి ఎమ్యెల్యే, ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా ఈ వివాదంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అచ్చెన్న అరెస్ట్ జస్ట్ ట్రైలర్ మాత్రమేనని..అసలైన సినిమా ముందుందని, రక్తి కట్టే సన్నివేశాలు, ఉత్కంఠకు గురించేసే సన్నివేశాలు ఇంకా చాలానే ఉన్నాయ్…జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటూ తనదైన శైలిలో చెలరేగారు. తప్పు చేసారు కాబట్టే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు.
చట్టం ముందు ఎవరైనా తలవంచక తప్పదన్నారు. ఆధారాలతో అరెస్ట్ చేస్తే చంద్రబాబు కిడ్నాప్ చేసారంటారు? అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో? ఆయనకైనా అర్ధమవుతుందా? అని ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాలేదన్నారు. తాము తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోవచ్చని తొడగొట్టిన లోకేష్ సాక్ష్యాలతో అచ్చెన్నను అరెస్ట్ చేస్తే ఎందుకు చెవి కోసిన మేకలా అరుస్తున్నాడని మండిపడ్డారు. ఫైర్ గ్రిడ్, చంద్రన్న కానుకుల్లో జరిగిన అవినీతి కింద చంద్రబాబు అండ్ సన్ కూడా జైలుకెళ్లడానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు.