పవన్ కళ్యాణ్ విషయంలో పవర్ స్టార్ అనే పేరుకు వచ్చినంత క్రేజ్ జనసేనాని పేరుకు రాలేదనేది వాస్తవం. సినిమా రంగంలో పవర్ స్టార్ గా అంతులేని ప్రేక్షకాదరణ పొందారు పవన్. కలెక్షన్లు, వ్యూస్, ట్రెండ్స్, రెమ్యునరేషన్ ఇలా అన్నిటిలోనూ రికార్డులు క్రియేట్ చేశారు. ఫ్యాన్ బేస్ పరంగా కొత్త ట్రెండే సృష్టించారు. అలా సినీ రంగంలో విపరీతమైన స్టార్ డమ్ అనుభవిస్తున్న సమయంలోనే వాటన్నింటినీ వదిలేసి రాజకీయాల్లోకి దిగారు. అదేదో సినిమాలో వర్మ చెప్పినట్టు తన సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడి కొట్టుకునే జనం అదే తన కోసం ఎన్నికల్లో ఓట్లు ఎందుకు వేయరు అనుకున్నారో ఏమో కానీ అభిమానుల మీద బోలెడు ఆశలు పెట్టుకుని పార్టీ పెట్టి ఎన్నికల్లోకి దిగారు. తీరా ఫలితాలు చూస్తే సినిమాలకు, రాజకీయాలకు చాలా దూరం ఉందనే సంగతి ఆయనకు తెలిసొచ్చింది.
సినిమాల పరంగా పవన్ ను ఆరాధించే జనంలో సగం మంది కూడ ఆయనకు ఓట్లు వేయలేదు. ఈ విషయాన్ని పవన్ ముందే ఒప్పుకున్నారు కొందరు అభిమానులు. అలా సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన పవన్ రాజకీయాల్లో మాత్రం ఘోర వైఫల్యాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రచారంలో అనేక మార్లు తన పూర్తి సమయం రాజకీయాలకే అంకితం అన్న ఆయన ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నారు. తిరిగి సినిమాల్లో నటించడం స్టార్ట్ చేశారు. దీంతో చాలామంది పవన్ మాట తప్పి సినిమాల్లోకి వెళ్లిపోయాడని, ఆయన పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని విమర్శించారు. అభిమానులు పవన్ పునరాగమనాన్ని స్వాగతించినా విమర్శలకు మాత్రం ఓర్వలేకపోయారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఇప్పటికీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
పైకి కనిపించట్లేదు కానీ వారిలో పవన్ పార్టీకి న్యాయం చేయట్లేదనే అసంతృప్తి దాగి ఉంది. పవన్ పార్టీ పెట్టాక ఆయన అభిమానుల్లో సగం మంది సినిమాల దగ్గరే ఆగిపోగా ఇంకో సగం మంది వాటిని దాటి రాజకీయాలకు వచ్చేశారు. వీరితోనే ఇప్పుడు పెద్ద చిక్కు రానుంది. ఎందుకంటే వీరంతా పవన్ ను సినిమా హీరోగా చూడటం మానేసి నాయకుడిగా చూడటం స్టార్ట్ చేశారు. పవన్ రాజకీయాల నుండి సినిమాల్లోకి యూటర్న్ తీసుకున్నంత ఈజీగా వాళ్లు తీసుకోలేకపోతున్నారు. అందుకే పవన్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ హాడావిడిలో వారు పాల్గొనలేకపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వారికి పవన్ రాజకీయాలతో పని కానీ ఆయన చేసే సినిమాలతో కాదు.
అందుకే వచ్చే ఏడాది విడుదలకానున్న ‘వకీల్ సాబ్’ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మునుపటిలా పవన్ సినిమాకు ఓపెనింగ్స్, కలెక్షన్స్, లాంగ్ రన్ వస్తాయా రావా అనే మీమాంస మొదలైంది. ఎన్నికల సమయంలో జనసేనకు ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేస్తారా అనే అనుమానం తరహాలోనే పవన్ అభిమానులంతా అంటే రాజకీయ అభిమానులు మునుపటిలా ఆయన సినిమాలను ఎగబడి చూస్తారా అనే సందేహం పుట్టుకొచ్చింది. రాజకీయాల్లో సందేహానికి ఫ్యాన్స్ అంతా ఓట్లు వేయరని, వేయలేదని సమాధానం వచ్చింది. మరి సినిమాల్లో సందేహానికి ఎలాంటి ఆన్సర్ వస్తుందో, పవర్ స్టార్ నుండి జనసేనానిగా పరిణామం చెందిన పవన్ తిరిగి పవర్ స్టార్ ఇమేజ్‌ను నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.