నారా చంద్రబాబు నాయుడు…తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే కాదు ఒకానొక సమయంలో జాతీయ రాజకీయాలను సైతం శాసించిన వ్యక్తి.. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఉదాహరణలతో సహా ఆయనే చెబుతుంటారు. పాలిటిక్స్ లో తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్. ముఖ్యంగా రాజకీయంగా తనకు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు చంద్రబాబు వేసే ఎత్తుకు పై ఎత్తుల విషయంలో ఆయనను ప్రత్యర్థులు సైతం ప్రశంసిస్తారు. మొత్తానికి చంద్రబాబు గురించి ఇటు సొంత పార్టీ వాళ్లయినా…అటు శత్రువులైనా ఓవరాల్ గా అందరూ చెప్పే మాట ఒకటే!…అబ్బో…ఆయన మామూలోడు కాదు…కిందపడినా ఏదో రకంగా పైకొస్తాడు అని!…మరి అలాంటి చంద్రబాబులో ఇప్పుడు చేవ సన్నగిల్లిందా?…వ్యూహాలు ప్రతి వ్యూహాల్లో బాగా తడబడుతున్నారా?….అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎలాగంటే?…
డిఫరెంట్…పొలిటికల్ జర్నీ
మొదట రాజకీయ ఆరంగ్రేటం కాంగ్రెస్ ద్వారా…1978 లో శాసన సభ్యుడిగా పోటీ చేసే అవకాశం తెచ్చుకోవడం…నూతన పంథాలో రాజకీయ ప్రచారం-పోల్ మేనేజ్ మెంట్ తో ఎమ్మెల్యేగా తొలి గెలుపు. ఆ తర్వాత ఏకంగా మంత్రి పదవి సాధించడం… ఆ పదవి వల్లే ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకునే అవకాశం రావడం…ఆ తరువాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దరిమిలా తాను కాంగ్రెస్ లోనే ఉండి ఓటమి పాలవడం…ఆ తరువాత టిడిపిలోకి జంప్ చేయడం…క్రమంగా ఎన్టీఆర్ తరువాత ఆయనే అనే స్థాయికి ఎదగడం, 1995లో టిడిపి అధికారంలోకి రాగా లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీని,సిఎం పదవిని తన చేతుల్లోకి తెచ్చుకోవడం…ఆ తరువాత 1999 ఎన్నికల్లో తన సారథ్యంలో టిడిపిని గెలిపించడం. ఆతరువాత 2004,2009 ఎన్నికల్లో ఓటమి…మళ్లీ 2014లో గెలుపు…2019లో ఓటమి…ఇదీ సూక్ష్మంగా చంద్రబాబు రాజకీయ ప్రస్థానం.
క్రైసిస్ మేనేజ్ మెంట్ లో కింగ్…
క్రైసిస్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబును కొట్టేవారు ఉండరంటారు….అంతేకాదు…లాబీయింగ్ లోనూ కింగే…ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో…ఎప్పుడు ఎవరిని ఎలా నొక్కాలో…ఎక్కడ తొక్కాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలీదంటారు. కాబట్టే ఎన్నో సార్లు కిందకుపడినా మళ్లీ లేచొచ్చారు. మరి అలాంటి చంద్రబాబు ఇటీవలి కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు సెల్ఫ్ గోల్ అవుతుండటంతో సొంత పార్టీ వారికే రుచించడంలేదు. పైగా ప్రత్యర్థులు మరింత బలం పుంజుకోవడానికి దోహదపడుతున్నాయి.
గత ఎన్నికల్లో పెద్ద తప్పు…
2019 ఎన్నికలకు వెళ్లే సందర్భంలో చంద్రబాబు మోడీ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసి జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతిస్తూ తీసుకున్న నిర్ణయం…ఆ పార్టీని తన భుజాన వేసుకొని వారి గెలుపు కోసం చేసిన విశ్వప్రయత్నం ఆయన అక్కడే కాదు ఇక్కడ కూడా దారుణంగా దెబ్బతినడానికి కారణమైంది. అటు కాంగ్రెస్, ఇక్కడ చంద్రబాబు ఘోర ఓటమిని కూడగట్టుకున్నారు. అయితే ఆ సమయంలో మోడీని ఉద్దేశించి చంద్రబాబు తిట్టిన తిట్లు అన్నీ ఇన్ని కావు. అందుకే ఎన్నికలు అయ్యాక చంద్రబాబు మోడీని మంచి చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఏ మాత్రం సఫలం కావడం లేదు. అయినా సరే చంద్రబాబు తన ప్రయత్నాన్ని విరమించకుండా ‘నీ సుఖమే నే కోరుకుంటా’ననే చందంగా ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు తన ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే చంద్రబాబు వ్యూహ చతురతపై అందరికీ సందేహాలు రేకెత్తిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎలా?
రాష్ట్రంలో 151 ఎమ్మెల్యే సీట్లు,జాతీయ స్థాయిలో 22 ఎంపి సీట్లు(తిరుపతి ఎంపి మరణంతో ప్రస్తుతం 21)తో తిరుగులేని స్థాయిలో ఉన్న వైసిపి అధినేత,సిఎం జగన్ కాంగ్రెస్ తో తనకున్న బద్ద శత్రుత్వం కారణంగా ప్రతి విషయంలో మోడీకి బేషరుతుగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీతో నేరుగా జత కట్టారు. అలాంటప్పుడు జాతీయ స్థాయిలో మద్దతు అవసరమైతే వైసిపిని, రాష్ట్రంలో రాజకీయంగా జనసేననో, ఇంకా అవసరమైతే వైసిపినో వినియోగించుకోవడానికి మోడీకి ఛాన్స్ ఉండగా ఇంక చంద్రబాబుతో అవసరమేంటనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఒకవేళ జాతీయ స్థాయిలో మోడీకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే లోక్ సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసిపి ఆదుకోవడానికి సిద్దంగా ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి అంటూ వస్తే వాళ్లిద్దరూ మరింత క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి అయినా మోడీకి, బిజెపి బాబు జీ హుజూర్ అనడంలో అర్థం ఏముంది?
లాభం లేకపోగా నష్టం…
అందుకే చంద్రబాబు ఇకనైనా మోడీ ప్రసన్నత కోసం ప్రయత్నాలు మాని రాష్ట్రంలో తమ పార్టీని గాడిన పెట్టడంపై దృష్టి కేంద్రీకరించడం మేలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కారణం దేశంలో మిగతా చోట్ల ఎలా ఉన్నా ఎపిలో బిజెపికి ఏకపక్షంగా సానుకూల పవనాలు వీచే పరిస్థితి ఇప్పుడప్పుడే లేదు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేక హోదా, రాష్ట్రానికి తగినన్ని నిధులు ఇవ్వక పోవడం, రాజధాని మార్పు వంటి విషయాల్లో వారిపైన వ్యతిరేకతే ఉంది. అలాంటప్పుడు వచ్చే ఎన్నికల్లో మోడీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబుకు వచ్చే లాభం ఎంతో…ఏమిటో ఎవరూ చెప్పలేరు. ఆ క్రమంలో ఇప్పుడు రాష్ట్రంలో మరింత నష్టపోవడం తప్ప…అందుకే చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రంలో తాము బలం పుంజుకోవడానికి ఏం చెయ్యాలో ఆలోచిస్తేమంచిది.
ఇలా చేస్తే మంచిదేమో…
రాష్ట్రంలో బిజెపి పట్ల ఇప్పటికీ ఉన్న వ్యతిరేకత, ప్రస్తుతం ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం…ఉదాహరణకు జిఎస్టీ బకాయిలు ఎగ్గొట్టడం, కొత్త వ్యవసాయ బిల్లు, విద్యుత్ వ్యవస్థను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం ఇలాంటి అంశాలను ఊతంగా చేసుకొని వారిపై పోరాటం చేస్తే రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు పట్ల సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ ఎలాగూ ఆ పనిచేయలేరని అందరికీ అర్థం అయింది. అలా రాష్ట్రంలో బలం పుంజుకుంటే అది లోక్ సభ సీట్లకు ప్రయోజనకరమవుతుంది. అలాంటప్పుడు తాను వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోకుండా ఇంకా ‘వస్తాడు నా రాజు’ అనుకుంటూ మోడీ ప్రసన్నత కోసమే ఎదురుచూస్తూ ఉంటే మరోసారి మరోరకంగా పెద్ద తప్పు చేసినట్లే…బహుశా అదే అతి పెద్ద ఆఖరి తప్పు అవుతుందేమో!