Nara Lokesh: విద్యలో పారదర్శకత: అవకతవకలపై విచారణ, చేనేతలకు ప్రోత్సాహం – మంత్రి లోకేశ్

గత ఐదేళ్ల పాలనలో పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అసెంబ్లీలో వెల్లడించారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

అదే సమయంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల యూనిఫాంల తయారీ ఆర్డర్లలో కొంత శాతాన్ని చేనేత సహకార సంఘాలకు ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యేలతో ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

విద్యా రంగాన్ని అస్తవ్యస్తం చేసిన వైసీపీ: మంత్రి లోకేశ్‌

వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలకు సిద్ధం

అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్‌ సమాధానమిచ్చారు. చేనేత వృత్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, దాదాపు 50 నియోజకవర్గాల్లో చేనేతలు ఉన్నారని గుర్తుచేశారు. గతంలో చేనేత సొసైటీలకు ఆర్డర్లు ఇచ్చినప్పుడు సరఫరాలో జాప్యం, ప్రభుత్వ టెండర్లలో మార్కెట్ ధరలతో పోటీ పడటం వంటి సవాళ్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకే నలుగురైదుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, అందరితో చర్చించి ఒక పటిష్ఠ‌మైన విధానాన్ని రూపొందిస్తామని వివరించారు.

ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెండర్ల విధానంలో పారదర్శకత తీసుకొచ్చామని లోకేశ్ పేర్కొన్నారు. దీని ద్వారా గత ఏడాది విద్యార్థులకు అందించే కిట్లు, గుడ్లు, చిక్కీల కొనుగోళ్లలో రూ. 200 కోట్లు ఆదా చేశామని తెలిపారు. ఇదే విధానాన్ని కొనసాగించి, ఐదేళ్లలో విద్యాశాఖలో రూ. 1000 కోట్లు ఆదా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ఏడాది విద్యార్థులకు అత్యుత్తమ నాణ్యతతో, మన్నికైన వస్త్రంతో కొత్త యూనిఫాంలు అందించామని మంత్రి తెలిపారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తూ తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని లోకేశ్‌ గుర్తుచేశారు. మంగళగిరిలో ‘వీవర్స్ శాల’ ద్వారా చేనేతల ఆదాయాన్ని 40 నుంచి 50 శాతం పెంచేందుకు నిర్మాణాత్మక కృషి చేస్తున్నామని, మార్కెటింగ్ కోసం టాటా టనేరా వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని ఆయన సభకు వివరించారు.

Rithu Chowdary With Dharma Mahesh Video Goes Viral | Gowthai Chowdary | Vignan | Telugu Rajyam