రాజ‌కీయ బ‌లం ఉన్న మాన‌వ మృగం!

రాజకీయ బలం ఉంటే చాలు ఏదైనా చేసెయ్యొచ్చు.. ఎలాగైనా తప్పించేసుకోవచ్చు అని చాలామంది భావిస్తుంటారు. కానీ… ప్రతీసారీ అలా జరగదు. పాపం పండినరోజు, బాధితుల శాపనార్థాలు ఫలించిన రోజు గూబ పగిలిపోతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బీజేపీకి పనిచేసిన ఒక వ్యక్తి విషయంలో అదే జరిగింది. ఫలితంగా సిడ్నీ చరిత్రలోనే నీచ‌మైన రేపిస్టుగా అక్కడి మీడియా అత‌న్ని అభివ‌ర్ణించింది!

అవును… ఆస్ట్రేలియాలో భార‌త క‌మ్యూనిటీకి చెందిన ప్ర‌ముఖుడు బాలేష్ ధ‌న్‌ క‌డ్ గతంలో “ఓవ‌ర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ”కి చీఫ్‌ గా ప‌నిచేశాడు. త‌నకున్న రాజ‌కీయ బ‌లం.. ప‌ర‌ప‌తితో తాను ఏం చేసినా బ‌య‌ట‌ప‌డొచ్చ‌నుకున్నాడో ఏమో కానీ… సిడ్నీ డౌనింగ్ సెంట‌ర్ కోర్టులో అత‌నిపై 39 అభియోగాలు న‌మోద‌య్యాయి. యువ‌తుల‌తో స్నేహం న‌టించడం.. అనంటరం వారిని ఇంటికో, హోటళ్లకో తీసుకెళ్లడం.. మ‌త్తు మందు ఇచ్చి మ‌రీ అత్యాచారం చేయడం.. ఇతడి నిత్యకృత్యాలంట!

ఈ విషయాలు తాజాగా విచార‌ణ‌లో వెల్లడయ్యాయి. ఈ విధంగా ఐదుగురు కొరియ‌న్ యువ‌తుల‌ను మభ్యపెట్టి, వారికి మత్తు మందు ఇచ్చి, అత్యాచారం చేశాడ‌ని తాజాగా నిర్ధార‌ణ అయింది. పైగా తానుచేస్తున్న పనికిమాలిన పనిని త‌న సెల్ కెమెరాలో, బెడ్ కి ఎదురుగా ఉన్న అలారం క్లాక్‌ లో దాచిన సీక్రెట్ కెమెరాలో చిత్రీక‌రిస్తాడట.

ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న వీడియోల‌ను చూసిన జ్యూరీ… అత‌ని మృగచేష్టలతో విస్తుపోయిందంట. ఈ నేప‌థ్యంలో అత‌న్ని రాజ‌కీయ బ‌లం ఉన్న మాన‌వ మృగంగా న్యాయ‌స్థానం అభివ‌ర్ణించడం గమనార్హం. ఇప్పటికే ఇతనికి బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించిన న్యాయస్థానం… త్వరలో శిక్ష కన్ ఫాం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది!