అదొక యుద్ధ విమానం.! అంటే, యుద్ధ విమానాలు నడిపేందుకోసం పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించబడిన ఎయిర్‌క్రాఫ్ట్.! బెంగళూరు ఎయిర్ షో సందర్భంగా ఈ విమానాన్ని ప్రదర్శించారు. అది కూడా పూర్తిస్థాయి యుద్ధ విమానం కాదు, దాని తాలూకు ‘మోడల్’. అంతే, రచ్చ మొదలైంది. అసలు రచ్చకు కారణమేంటంటే, ఈ ఎయిర్ క్రాఫ్ట్ మీద హనుమంతుడి బొమ్మని ఉపయోగించారు. ‘ది స్టార్మ్ ఈజ్ కమింగ్’ అని కూడా పేర్కొన్నారు. యుద్ధ విమానాలపై హనుమంతుడి ఫొటో ఏంటి.? అంటూ కొందరు వివాదాన్ని లేవనెత్తారు.
ఔను కదా.? యుద్ధ విమానాలపై దేవుళ్ళ ఫొటోలు ఎందుకు.? విషయం వివాదాస్పదమువుతుందని తెలిసే ఇలా చేశారా.? అన్న చర్చ తెరపైకి రావడం సహజమే. న్యూస్ ఛానళ్ళలో డిబేట్లు మామూలే.. సోషల్ మీడియాలో యాగీ గురించి కొత్తగా చెప్పేదేముంది.? కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. ఈ మొత్తం వివాదాన్ని ఎంజాయ్ చేస్తోందన్న విమర్శలు లేకపోలేదు. హిందూ ఓటు బ్యాంకుని మరింత బలవంతంగా తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ఈ తరహా వ్యవహారాలు నడుపుతోందన్నది ప్రధానంగా వస్తున్న విమర్శ.
మరోపక్క, హనుమంతుడి ఫొటో వుంటే తప్పేంటి.? అన్న ప్రశ్న తెరపైకి రాకుండా వుంటుందా.? హనుమంతుడి బొమ్మ ఎందుకు – వుంటే తప్పేంటి.? అన్న అంశాలపై చర్చోపచర్చలు నడుస్తున్నాయ్. కాదేదీ వివాదానికి అనర్హం.! ముఖ్యమైన విషయాలు చాలా చాలా వుండగా, ఇలాంటి సున్నితమైన అంశాల్ని పట్టుకుని రాజకీయం చేయడమేంటో.!