జనసేనకు దిక్కు తోచడం లేదా?

Janasena Party
ప్రశ్నిస్తాం అంటూ పుట్టుకొచ్చిన పుట్టగొడుగు లాంటి జనసేన పార్టీ దాని పుట్టుక తరువాత అయిదేళ్లవరకూ ఎవ్వరినీ ప్రశ్నించిన పాపాన పోలేదు.  కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలకు అంటకాగుతూ చంద్రబాబు దోపిడీని బహిరంగంగా సమర్ధిస్తూ అభాసుపాలైన విషయం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.   అంతేకాకుండా  పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  అధికారంలో ఉన్న పార్టీని కాకుండా ప్రతిపక్షమైన వైసిపిని అడుగడుగునా విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ విమర్శలపాలై చివరకు ఎన్నికల్లో ఓటర్ల తిరస్కారానికి గురయ్యాడు. జనసేన అధ్యక్షుడుగా రెండు స్థానాల్లో పోటీ చేసి రెండుచోట్లా చీత్కారానికి గురయ్యాడు. 
 
ఏ విధమైన సినీ గ్లామర్, కోట్లరూపాయల ధనరాసులు, అభిమానగణం లేకపోయినప్పటికీ, లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ తెలంగాణలోని కూకట్పల్లి నుంచి పోటీ చేసి మొదటిసారి పోటీలోనే విజయం సాధించగా, బోలెడంత గ్లామర్, కోట్లాదిమంది అభిమానులు ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిపోవడం, ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఒక్కరు కూడా విజయాన్ని సాధించలేకపోవడం ఒక సంచలనంగా మిలిగిలింది.  గెలిచిన ఒక్క అభ్యర్థి కూడా అంతకుముందు వరకూ వైసిపిలో పనిచేసినవారు.  వైసిపిలో టికెట్ దక్కక జనసేన టికెట్ మీద పోటీ చేశారు.  కాబట్టి ఆ విజయం ఆయన ఖాతాలోకి వెళ్తుంది తప్ప పవన్ ఖాతాలోకి వెళ్ళదు.  
 
 జనసేన ఓటమికి స్వయంకృతమే కారణం.  అభిమానుల అతి ప్రవర్తన, జుగుప్సాకరమైన భాష, పెద్ద చిన్న గౌరవం లేకుండా పరమనీచంగా ఇతర పార్టీలవారిని దూషించడం, చివరకు ముక్కు ముఖం తెలియనివారిపట్ల కూడా సోషల్ మీడియాలో నోరు పారేసుకోవడం, రౌడీతనం చూపించటం లాంటి వెర్రి చేష్టలతో జనసేనను ప్రజలు అసహ్యించుకునేట్లు చేసుకున్నారు.    జనసేనకు ఒక్క సీట్ కూడా రావడం కష్టమే అని నేను ఎన్నికలకు ముందు అనేక వ్యాసాల్లో స్పష్టంగా రాసాను.  అలాగే పవన్ కళ్యాణ్ గెలవడం అసంభవం అని కూడా కుండబద్దలు కొట్టి చెప్పాను.   నా పాఠకులకు ఆ పోస్టులు గుర్తుండే ఉంటాయి.   పవన్ కూడా తాను ఒక పార్టీకి అధ్యక్షుడిని అనికూడా మర్చిపోయి జగన్ మీద కారుకూతలు కూసి సంస్కారం అనేది తన ఒంట్లో లేదని నిరూపించుకున్నాడు.  జగన్ ను ముఖ్యమంత్రి కానివ్వను అంటూ ప్రతిజ్ఞలు చేశాడు.   
 
ఇక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత జనసేన గ్లాసు ముక్కలైపోయింది.  నాయకులంతా ఎవరిదారి వారు చూసుకున్నారు.  ప్రస్తుతం ఆ పార్టీలో ఒక్క నాదెండ్ల మనోహర్ తప్ప మరెవరూ చెప్పుకోదగినవారు లేరు.  మనోహర్ కూడా వేరే ఏ పార్టీలోకి వెళ్ళడానికి ముఖం చెల్లక ఉంటున్నారు తప్ప మనస్ఫూర్తిగా అని చెప్పలేము.  కార్యకర్తలు కూడా చాలామంది కకావికలైపోయారు.  ఎవరో కొందరు మాత్రం జగన్ మీద ద్వేషంతో, కులాభిమానంతో పవన్ కళ్యాణ్ ను మోస్తున్నారు తప్ప పవన్ లో ఎలాంటి సత్తా లేదని అందరికీ స్పష్టమైపోయింది.  
 
ఎన్నికలు అయిపోయి, అఖండమైన ఆధిక్యతతో జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక కూడా జగన్ మీద విమర్శలను మానుకోలేదు.  కొత్త ప్రభుత్వానికి కొంచెం వ్యవధి ఇవ్వాలనే కనీస జ్ఞానం కూడా లేకుండా తెలుగుదేశంతో కలిసి జగన్ మీద అవాకులు చెవాకులు పేలుతూనే ఉన్నాడు.  అయితే జగన్ ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవడం పవన్ లో మరింత ఉక్రోషాన్ని పెంచింది.  సినిమాలు చెయ్యను అని ఎన్నికలకు ముందు అనేకమార్లు ప్రకటించి ఎన్నికల్లో తలంటి కాగానే మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టి తనకు మాట నిలకడ లేదని రుజువు చేసుకున్నాడు. 
 
ఇక జగన్ ను ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని గ్రహించగానే బీజేపీతో పొత్తు అంటూ ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ అధ్యక్షుడితో మాట్లాడి పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రకటించాడు.  అయితే సాక్షాత్తూ పవన్ ఢిల్లీ వెళ్లినా అక్కడ మోడీ, అమిత్ షా లు పవన్ కు మహాలఘుదర్శనం కూడా ఇవ్వకపోవడం జనసేన కార్యకర్తలను నిరాశ పరిచింది.  దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కు జనబలం  ఏమాత్రం లేదని, ఆయన మాటలన్నీ పైన పటారం లోన లొటారం బాపతే అని బీజేపీ పెద్దలకు అర్ధం అయిందని భావించాలి.   
 
మిగిలి ఉన్న ఒకరో ఇద్దరో క్షతగాత్రులైన జనసైనికులు జగన్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ శునకానందం పొందుతుంటే, వారికి దాన్ని కూడా కరువయ్యే విధంగా హఠాత్తుగా జగన్ ను ప్రశంసిస్తూ పవన్ రెండు ట్వీట్స్ చేయడం జనసేన కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నది.  ఇకమీదట జగన్ ను తిట్టాలా లేక  పొగడాలో అర్ధం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.   పవన్ కళ్యాణ్ వైఖరి చూస్తుంటే బీజేపీ పెద్దలు జగన్ కు లోలోపల మద్దతు ఇస్తున్నారని సందేహం కలిగినట్లు తోస్తుంది.  బీజేపీ అగ్రనేతలు జగన్ తో సఖ్యత నెరపాలని కాంక్షిస్తున్నప్పుడు పవన్ లాంటి లక్షమంది వచ్చినా ప్రయోజనం ఏముంటుంది?  ఏమైనప్పటికీ బీజేపీ, వైసీపీల ఆంతర్యం ఏమిటో అర్ధం కాక పవన్ అయోమయానికి గురవుతున్నట్లు ఆయన పోకడలు స్పష్టం చేస్తున్నాయి.    ఏమైనప్పటికీ పవన్ తాజా ట్వీట్స్ తో జనసైనికులు బిక్కచచ్చిపోయారనేది యదార్ధం.  ప్రస్తుతం జనసేన అనేది పిచ్చోడి చేతిలో రాయిగా మారిపోయింది.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు