విషవృక్షానికి పాలు పోసి పెంచితే తియ్యని కాయలు కాస్తాయా?
అశుద్ధం ఆరగించి జీవించే వరాహానికి అమృతఫలాలు పెట్టినా అది తన వెనుకటి అలవాటు మానుకుంటుందా?
మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా అంతే! డబ్బులు ఇవ్వని విటుడిని తిట్టిపోసే వారకాంతలా వారాంతంలో జగన్మోహన్ రెడ్డి మీద కాస్త పేడనీళ్ళు చల్లంది ఆయనకు నిద్రపట్టదు. మూడు రాజధానుల ముచ్చటతో నిద్రపట్టని రాధాకృష్ణ “ఆంధ్రుడా మేలుకో” అంటూ తాజాగా ఆవులించాడు!
”అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే ఎలా? రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలిగా?”.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు ఆయన మందీమార్బలం చేస్తున్న వాదన ఇది! ఈ వాదన నిజమేనని నమ్మాలంటే అభివృద్ధికి నిర్వచనం ఏమిటో వాళ్లు ముందుగా వివరించాలి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయి. రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం మచ్చుకు కూడా కనిపించడం లేదు.” అంటూ గొంతు చించుకుంటున్నాడు.
అవును కదా! తన యజమాని చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలో స్వర్ణమయమైన రావణ లంకను నిర్మించాడు కదా! ఎక్కడ చూసినా బంగారు గృహాలు, వీధుల్లో కూరలు అమ్మినట్లు వజ్రాలు, రత్నాలు కుప్పలు పోసి అమ్మారు కదా! అంబరాన్ని అంటే నవరత్నశోభిత సౌధాలు, బాహుబలి సినిమాలో చూపినదానికన్నా మిన్నగా లోయలు, సెలయేళ్ళు, గంటకు ఆరువేల కిలోమీటర్ల వేగంతో దూసుకునిపోయే హైపర్ లూప్ రైళ్లు, బులెట్ రైళ్లు, గగనమార్గాలు నిర్మించి దేవేంద్రుడి అమరావతిని కూడా మించిపోయేట్లు చంద్రబాబు గారు అమరావతిని నిర్మించారు కదా! అందుకే పాపం జగన్మోహన్ రెడ్డి రాగానే ఏమాత్రం అభివృద్ధి కనిపించడంలేదని తన దాయాది మత్సరాన్ని దాచుకోకుండా చాటుకున్నాడు!
“మూడు రాజధానుల నిర్ణయంపై ఇంటా–బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ జగన్ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై తాజాగా ఎదురు దాడులు మొదలెట్టారు. ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే ప్రైవేట్ పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో జగన్మోహన్‌రెడ్డి ఈ దిశగా ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదు.”
భళా బాధాకృష్ణా! మూడు రాజధానుల విషయంలో ఇంటా – బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయట! మాయాబజార్ సినిమాలో శశిరేఖ, లక్ష్మణ కుమారుల పెళ్ళికి ముహూర్తం నిర్ణయించి బలరాముడికి చెప్పడానికి వస్తాడు శకుని. ఆ సమయంలో బలరాముడు ఇంటి పురోహితుడికి, దుర్యోధనుడి ఇంటి పురోహితుడికి మధ్య కొన్ని సంభాషణలు ఉన్నాయి. ఈ పెళ్లి జరిగితే ఆలుమగల మధ్య కలహాలు, కష్టాలు తప్పవు” అని బలరాముడి పురోహితుడు చెప్పినపుడు…కలహం అంటే ప్రణయకలహం అని, కష్టాలు అంటే బహుసంతానప్రాప్తి అని భాష్యం చెప్పుకోవాలి అని దుర్యోధనుడి పురోహితులు చెబుతారు. అలాగే ఇక్కడ ఇంటా బయటా అనగా చంద్రబాబు ఇంట్లో, ఇంటి బయట అని మనం అర్ధం చేసుకోవాలి. ఆమాత్రం తెలియదా!! ఇక ప్రయివేట్ పెట్టుబడులను ప్రోత్సహించినపుడే అభివృద్ధి జరుగుతుంది అని తన ఆర్థికమేధస్సును రంగరించి చెబుతున్న రాధాకృష్ణ తన ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని అమరావతికి ఎందుకు తరలించలేదు? చంద్రబాబు చేసిన అభివృద్ధికి ఎందుకు సహకరించలేదు?
“ఈ సందర్భంగా కేటీఆర్‌తో పాటు వెళ్లిన బృందంలోని సభ్యులు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దావోస్ సదస్సులో పాల్గొన్న పలువురు ”ఆంధ్రప్రదేశ్‌లో ఇలా ఎందుకు జరుగుతోంది? అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రాన్ని ఎందుకు దెబ్బతీసుకుంటున్నారు?” వంటి ప్రశ్నలు పదే పదే అడిగారట. దీన్నిబట్టి అంతర్జాతీయ వేదికలపై కూడా ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందని భావించాల్సి ఉంటుంది.”
దావోస్ లో పాల్గొన్న ప్రతినిధులను గత అయిదేళ్లుగా చంద్రబాబు, ఆయన ముఠా ఎంతగా తప్పుదోవ పట్టించారో పై కామెంట్స్ ను బట్టి అర్ధం చేసుకోవచ్చు. దావోస్ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ గురించి కేటీఆర్ ను అడిగారని కేటీఆర్ చెప్పారా? తానే ఒక అబద్ధాన్ని సృష్టించి, ఆ అబద్ధపు తాలూకు తీర్పును కూడా రాధాకృష్ణ ప్రకటించేసారు!
“”భీమవరం చరిత్రలో మొదటిసారిగా ఇప్పుడు భూముల ధరలు పడిపోయాయి. దీన్నిబట్టి అమరావతి ప్రాంతంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందన్న మాట! ఈ పరిణామానికి జగన్ అండ్ కో గానీ, వారిని గుడ్డిగా సమర్థిస్తున్నవారు గానీ ఏమి సమాధానం చెబుతారో వినాలని ఉంది.””
దీన్నిబట్టి మనకు ఏమి అర్ధం అవుతుంది? రాధాకృష్ణ, చంద్రబాబుల దృష్టిలో రాజధాని, అభివృద్ధి అంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం. భూముల ధరలు పెరిగితే అభివృద్ధి సాధించినట్లు. ధరలు తగ్గితే అభివృద్ధి లేనట్లు! రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాలను కబ్జా చేసి నలభై వేలకోట్ల రూపాయల కుంభకోణాలకు చంద్రబాబు ఆయన దొంగల ముఠా పాల్పడ్డదని జగన్ చేసిన ఆరోపణ నూటికి నూరుపాళ్లు వాస్తవం అని రాధాకృష్ణ కక్కేసాడు. ఎక్కడైనా అభివృద్ధి అంటే పరిశ్రమలు రావడం, పెట్టుబడులు రావడం, నిరుద్యోగులకు ఉపాధి దొరకడం, జీడీపీ పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, పౌరసేవలు సక్రమంగా అందడం, లంచగొండితనం, అవినీతిని రూపుమాపడం అని మన పిచ్చినమ్మకం. కానీ, రాధాకృష్ణ, చంద్రబాబులాంటి వ్యాపారుల దృష్టిలో ఇవాళ పదిలక్షలు కొన్న ఎకరం ఏడాదిలోపల పదికోట్లు అయిపోవాలి! అదే అభివృద్ధి!!!
“గడిచిన ఎనిమిది మాసాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 60 వేల కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి. ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నారు.” అంటూ ఆక్రోశిస్తున్నాడు రాధాకృష్ణ!
గడచిన ఎనిమిది మాసాల్లో అరవైవేల కుటుంబాలు హైద్రాబాద్ కు వలస వెళ్లాయి అంటే అర్ధం ఏమిటి? చంద్రబాబు ఐదేళ్లు పాలించినా వాళ్ళెవ్వరికీ ఉపాధి దొరకలేదనే కదా? 2014 – 2019 మధ్య మొత్తం ఎనిమిది లక్షలమంది సీమాంధ్రులు బతుకుతెరువు కోసం హైద్రాబాద్ వలస వెళ్లారని ఇటీవలే కొన్ని పత్రికలు ప్రచురించిన విషయం రాధాకృష్ణ గుడ్డికళ్లకు కనిపించి ఉండదు. ఆ ఐదేళ్లలో ఎన్ని లక్షలమంది అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ లాంటి దేశాలకు వలస వెళ్ళాయో లెక్కలున్నాయా రాధాకృష్ణా? ఇక ఆ వలస వెళ్లినవారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు కూడా ఉన్నారని మరో చమక్కు! ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద వ్యాపారులు రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, మేకపాటి కుటుంబం, మాగుంట కుటుంబం, జివికె, జి ఎమ్ ఆర్ కుటుంబం కేవలం ఆంధ్రాలోనే వ్యాపారాలు చేస్తున్నారా? వారెవరూ జగన్ రాకముందువరకూ వేరే రాష్ట్రం, వేరే దేశంలో వ్యాపారాలు చెయ్యలేదా?
ఇంకా తన చెత్తపలుకులోకి ప్రశాంత్ కిషోర్ ను కూడా లాక్కొచ్చాడు రాధాకృష్ణ. జగన్ ను గెలిపించినందుకు ప్రశాంత్ కిషోర్ వలవల ఏడుస్తున్నాడట. చంద్రబాబు ఓటమికి ఎందుకు కృషి చేసానా అని తెగ బాధ పడుతున్నాడట. అలాగే అంతకుముందు చంద్రబాబుకు లేని కులగజ్జిని తానే సృష్టించి చంద్రబాబు పట్ల ప్రజల్లో ద్వేషం కలిగించానని అల్లాడి దొర్లాడుతున్నాడట…ఏమయ్యా ప్రశాంత్ కిషోర్…నీకు తెలుగు చదవటం రాదని ఎంత ధైర్యమో చూసావా మా బాధాకృష్ణకు!
పాపం…రాధాకృష్ణా…నీ బాధ ప్రపంచం బాధ కాబోదు! ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఏడ్చి మొత్తుకునే రాత నీ ముఖాన రాసిపెట్టి ఉందొ? అంతవరకు మాకు వారం వారం వినోదం తప్పదు!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు