మన పై అధికారికి దగ్గరై ఆయన మెప్పు పొందాలంటే ఆయన పెంపుడు కుక్కను పొగడాలి అని సామెత. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా, ఎక్కడ అడుగు పెడితే అక్కడ భస్మం అన్నట్లు తయారైన రాజకీయజీవితంతో ఎక్కడా తలెత్తుకోలేక, దిక్కుతోచక బతుకుతున్న నాగబాబు అనే ఒక అరవై ఏళ్ల వ్యర్థుడు మహాత్మాగాంధీని హత్యచేసిన నాధూరాం గాడ్సే అనే ఒక వ్యక్తిని డెబ్బై రెండేళ్ల తరువాత పొగడ్తలతో ముంచెత్తడం కొంచెం సంచలనకరమైన విషయమే. నాగబాబు గూర్చి ముందుగా చెప్పుకోవాలి. ఈయన జీవితంలో సొంతకాళ్ళ మీద బతకడానికి అనేక ప్రయత్నాలు చేసినమాట వాస్తవం. నటుడుగా, నిర్మాతగా ఏదో పొడిచెయ్యాలని ఆశించాడు. కానీ, ప్రేక్షక దేవుళ్ళు మాత్రం నీకు అంత సన్నివేశం లేదు పోవయ్యా అని ముఖం పగిలేట్లు చెప్పేసారు. దాంతో అరవై పదుల వయసుకు చేరుకున్నప్పటికీ, చిరంజీవి తమ్ముడుగా, పవన్ కళ్యాణ్ అన్నయ్య అనే పరిధిని దాటి గుర్తింపు సాధించలేకపోయారు.
ఇక నాగబాబు హఠాత్తుగా మొన్న నాధూరాం గాడ్సే దేశభక్తిని ఎందుకు పొగిడాడు? అసలు ఈయనకు నాథూరామ్ గాడ్సే ఎవరో కూడా తెలిసి ఉండదు. ఎందుకంటే ఈయన విద్యాగంధం అంతంతమాత్రమే. పదిమందిలో మాట్లాడితే మళ్ళీ ఎదుటివారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకే ఇంట్లో కూర్చుని ట్విట్టర్ లో ఒక రెట్ట వేశాడు. ఇప్పుడు గాడ్సే దేశభక్తుడు అని ఈయనగారు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అగత్యం ఎందుకు కలిగింది? కొంచెం మనం పరిశీలించాలి.
మెగాస్టార్ గా ప్రఖ్యాతుడైన చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీని పెట్టుకున్నప్పుడు దానికి తెరవెనుక నాగబాబు కొంత కృషి చేసారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, అభిమానులతో రహస్య సమావేశాలను నిర్వహించి, అలాగే నిధులను కూడా కూడగట్టి “ఇక చిరంజీవి ముఖ్యమంత్రి అయిపోయినట్లే” అని కలలప్రపంచంలో విహరించాడు. చిరంజీవి ముఖ్యమంత్రి అయితే తాను మంత్రి, తమ్ముడు పవన్ సైన్యాధిపతి, బావమరిది అరవింద్ రాజగురు, తమది రాజకుటుంబం అన్న రీతిలో స్వైరకల్పనల్లో తేలియాడారు. కానీ, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి కావడంతో వీరి ఆశల పల్లకీలు కూలిపోయాయి. ప్రజారాజ్యం లో ఉన్నప్పుడు వీరు మథర్ తెరిస్సా, జ్యోతిరావు పూలే మొదలైనవారు నామస్మరణతో హోరెత్తించారు.
ఇక ఆ తరువాత తమ్ముడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమానగణం, ఈలలు, కేకలతో పిచ్చిఅరుపులు అరిచే వెఱ్ఱిఅభిమానుల కేరింతలు చూసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయినట్లే అని నమ్మేశారు. పదేళ్లక్రితం తాము స్తోత్రాలు చేసిన జ్యోతిరావు పూలే, మదర్ థెరిస్సా, అంబెడ్కర్ లను మర్చిపోయారు. చేగువేరాను రంగంలోకి దింపారు. చేగువేరా జపం ఎంత చేసినా, శేషేంద్ర కవితలను చదివినా, ఈ అన్నదమ్ముల మీద ప్రజలలో ఉన్న అసహ్యం ఎన్నికల ఫలితాల అనంతరం తెలిసింది. అన్నదమ్ములు ఇద్దరూ చిత్తుగా ఓడిపోయారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ పరువు ఇటు గోదావరిలో కొంత, బంగాళాఖాతంలో కొంత కలిసిపోయింది. దానికితోడు పాకేజీలు ఇచ్చే చంద్రబాబు దారుణంగా ఓడిపోవడం, “జగన్ ను ముఖ్యమంత్రి కానివ్వను” అని హుంకారాలు చేసినప్పటికీ, జగన్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చాప చుట్టెయ్యడంతో మెగా సోదరులకు నిద్ర కరువైంది. ఇక అప్పటినుంచి చంద్రబాబు బానిసలుగా బతుకుతూ తమ పరువుమర్యాదలను పూర్తిగా పోగొట్టుకున్నారు. జనసేన అనేది రేకులు రాలి అస్థిపంజరంలా మిగిలిపోయింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఢిల్లీవెళ్లి బీజేపీతో దోస్తానా కట్టారు. బీజేపీతో మైత్రిబంధం పెట్టుకున్నప్పటికీ, ఇంతవరకు వారికి మోడీ, అమిత్ షా ల దర్శనభాగ్యం కరువైంది. చంద్రబాబు నుంచి వచ్చే పాకేజీలు వస్తున్నాయో లేదో తెలియదు కానీ, బీజేపీ నుంచి ఏమాత్రం సానుకూల సంకేతాలు రావడం లేదు. అసలు పవన్ అనే ఒక తీసేసిన తాసిల్దారు తమతో వియ్యం అందాడని బీజేపీ అధినాయకత్వం గుర్తించనే లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి దగ్గర కావడం అవశ్యం. మరి బీజేపీ చంకలో దూరాలంటే ఏమి చెయ్యాలి? బీజేపీ లోని కొందరు అతివాదులు కీర్తించే నాధూరాం గాడ్సేను కీటించాలి. గాంధీని దూషించాలి. గతంలో చాలామంది బీజేపీ నాయకులు గాడ్సేను దేవుడిని చేసారు. అయితే వారంతా ఒరిజినల్ బీజేపీ నాయకులు. కరుడుగట్టిన ఆరెస్సెస్ వాదులు. కానీ, మన పవనయ్య, నాగయ్య అలా కాదుకదా! అందుకనే మోడీ దృష్టిలో పడటానికి పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగమే గాడ్సేకు నాగబాబు ధ్రువపత్రాన్ని ప్రసాదించడం! ఇక గాడ్సేను దేశభక్తుడిగా స్తుతిస్తూ జనసైనికులు కోరస్ అందుకోవడమే ఆలస్యం!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు