మన్మథుడికే మరులు గొలిపే రూపం ఆయనది
కంచు సైతం బిత్తరపోయే కంఠస్వరం ఆయనది
ఆజానుబాహుడు అరవిందదళాయతాక్షుడు
ఆయన నడక చూసి కంఠీరవం సైతం కలవరపడుతుంది
ధోవతి కట్టులో ఆయన్ను చూస్తే మతి పోతుంది
ఆయన చిరునవ్వు చూసి రాయంచలు కూడా పులకరిస్తాయి
రాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు
శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఆయన్ను చూస్తే ఆయనంత సొగసుగా ఉండాలని ఆకాంక్షిస్తారు, ఆశపడతారు
ఆయనెవరో అందరికీ తెలుసు…తెలుగు జాతి చరిత్రకు గర్వకారణం, 20 వ శతాబ్దపు పురుష పుంగవుడు, నటరత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు..అలియాస్ ఎన్టీఆర్ అలియాస్ ఎన్టీవోడు!
1923 మే నెల ఇరవై ఎనిమిదో తారీఖున నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ భవిష్యత్తులో సినిమారంగాన్ని, రాజకీయ రంగాన్ని కూడా శాసిస్తారని ఎవరైనా ఊహించారా? కేవలం అదృష్టం మీద ఆధారపడిన సినిమారంగంలో ఎన్టీఆర్ సహస్ర పున్నమల కాంతులతో వెలిగిపోతారని, సినిమారంగానికి మూలస్తంభంగా నిలుస్తారని, ఎవరైనా కలగన్నారా? ఎన్టీఆర్ సినిమా జీవితం పూలరథంలా సాగిపోయింది. మొదటి సినిమా మనదేశంలో చిన్న పాత్ర అయినప్పటికీ, మూడేళ్ళ తరువాత విడుదల అయిన పాతాళభైరవి సినిమాతో ఒక్కసారిగా ఎన్టీఆర్ సూపర్ స్టార్ అయ్యారు. ఆ సినిమా డెబ్బై ఏళ్ళతరువాత కూడా కళాఖండంగా జననీరాజనాలు అందుకుంటున్నదంటే, అందులో ఎన్టీఆర్ భాగస్వామ్యం మామూలు స్థాయిదా!
ఎన్టీఆర్ ముఖవర్చస్సు, హావభావాలు ఎలాంటి పాత్రకైనా సరిపోతాయి. ఆయన పోషించిన పాత్రల గూర్చి ఇక్కడ పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వివరాలు తెలియని తెలుగువాడు ఎవరూ ఉండరు. ఉంటే అతడు తెలుగువాడు కానేకాదు. ఎన్టీఆర్ సృష్టించినన్ని రికార్డులు భారతదేశ సినిమా చరిత్రలోనే ఎవరూ సృష్టించలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ పోషించినన్ని పౌరాణిక పాత్రలు మరే నటుడు పోషించలేదు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, రావణాసురుడు, విశ్వామిత్రుడు, సుయోధనుడు, కర్ణుడు, బృహన్నల, కీచకుడు, నలకూబరుడు, పుండరీకుడు, భీష్ముడు, ఇంద్రజిత్, శ్రీనివాసుడు, నలుడు, బుద్ధుడు, దుష్యంతుడు, వాల్మీకి, వీరబ్రహ్మేంద్రస్వామి, అశోకుడు, శ్రీనాధుడు, బ్రహ్మనాయుడు, శ్రీకృష్ణ దేవరాయలు, చంద్రగుప్తుడు, చాణక్యుడు..ఇలా ఒకటేమిటి? . …పురాణాల్లో, చరిత్రలో చెప్పుకోదగిన ప్రముఖ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పోషించి మెప్పించిన నటుడు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. అలాగే కొన్ని సినిమాల్లో వివేకానందుడు, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబ్రహ్మన, సుభాష్ చంద్రబోస్, ఏకలవ్యుడు, గెటప్స్ లో కనిపించి అభిమానులకు నేత్రపర్వం గావించారు.
ఎన్టీఆర్ జీవితమే ఒక విచిత్రం. ఆయన దినచర్య మరీ విచిత్రం. ఆయన నిద్రలేచేది అందరూ గాఢనిద్రలో మునిగే బ్రహ్మీముహూర్తకాలం మూడు గంటలకు. కాలకృత్యాలు, వ్యాయామాలు, అన్నీ ముగించుకుని తెల్లవారుజామునే భోజనం చేసి అయిదు గంటలకల్లా ఫుల్ మేకప్ తో స్టూడియోకు వెళ్ళడానికి సిద్ధం! ఇదేదో ఒకరోజు రెండు రోజులు కాదు.. ఆయన జీవించినన్నాళ్లు ఇదే క్రమశిక్షణతో కూడా దినచర్యను పాటించారు. ఆ రోజుల్లో టూరిస్ట్ బస్సులు నడిపేవారు తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం తరువాత మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ దర్శనం కూడా ఉంటుందని కరపత్రాలు పంచేవారు. ఎన్టీఆర్ దర్శనంతో యాత్ర ముగిసేది. ఎన్టీఆర్ ను చూడటం కోసం వందలమంది మద్రాస్ లో ఆయన ఇంటిముందు తెల్లవారుజామునే ఎదురు చూసేవారు. వెంకన్న దర్శనం రెండు క్షణాలు, ఎన్టీఆర్ దర్శనం ఒక్క క్షణం అయినా చాలు అన్న అభిమానులు ఉన్నారు ఆరోజుల్లో! అంతటి వైభోగం, వైభవం భారతీయ సినిమారంగం చరిత్రలో ఏ నటుడూ అనుభవించి ఎరుగరు!
రోజూ రెండు మూడు షూటింగులు చేసేంత బిజీ సమయంలో కూడా ఆయన పదకొండు మంది సంతానానికి జన్మ ఇచ్చారు! కుటుంబ నియంత్రణ సిద్ధాంతానికి ఎన్టీఆర్ వ్యతిరేకం. ఆ సంగతిని ఆయన చాలా ధైర్యంగా చెప్పుకున్నారు. “ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు” అని కేంద్రప్రభుత్వం విస్తృతంగా ప్రసారం, ప్రచారం చేస్తున్న రోజుల్లో కుటుంబనియంత్రణకు వ్యతిరేకంగా “తాతమ్మకల” అనే సినిమాను నిర్మించారు ఆయన. కుటుంబనియంత్రణకు వ్యతిరేకంగా కొసరాజు చేత ఒక పాటను వ్రాయించి భానుమతితో పాడించిన ధైర్యశాలి.
ఎన్టీఆర్ నటించినన్ని పౌరాణిక సినిమాలు మరే నటుడూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. అలాగే శ్రీకృష్ణుడుగా ఎన్టీఆర్ అత్యధిక సినిమాల్లో నటించారు. మాయాబజార్, లవకుశ, సీతారామకల్యాణం, పాండురంగమహాత్మ్యం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణావతారం, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణంజనేయ యుద్ధం, వీరాభిమన్యు, దానవీరశూరకర్ణ, నర్తనశాల, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం, శ్రీకృష్ణ పాండవీయం, పాండవ వనవాసం, శ్రీకృష్ణార్జున యుద్ధం, భూకైలాస్, వినాయకచవితి, భీష్మ, శకుంతల, వాల్మీకి, మొదలైన సినిమాలు అఖండవిజయాన్ని నమోదు చేశాయి. నిర్మాతలమీద కనకధారలను కురిపించాయి. జానపద సినిమాలకు మహారాజుగా కాంతారావు వెలిగిపోతున్న తరుణంలో ఎన్టీఆర్ కూడా జానపద సినిమాలను చేసి చరిత్ర సృష్టించారు. జయసింహ, బాలనాగమ్మ, బందిపోటు, జగదేకవీరుని కథ, గులేబకావళి కథ, కంచుకోట, అగ్గిపిడుగు, మంగమ్మ శపధం, పిడుగురాముడు, విజయం మనదే, గండికోట రహస్యం, అలీబాబా నలభై దొంగలు, లాంటి సినిమాలు బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టాయి. మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ, బొబ్బిలి యుద్ధం, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి లాంటి చారిత్రక సినిమాల్లో ఆయా పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసారు ఎన్టీఆర్. శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇప్పటికీ ఎన్టీఆర్ రూపమే మదిలో మెదులుతుంది తెలుగువారికి.
ఎంత గొప్ప హీరోలకైనా ఎత్తుపల్లాలు సహజం, అనివార్యం. ఎన్టీఆర్ కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఒకదశలో ఎన్టీఆర్ నటించిన జానపద సినిమాలు వరుసగా పరాజయం పొందాయి. అలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ స్వయంగా నిర్మించిన కోడలు దిద్దిన కాపురం, వరకట్నం, ఉమ్మడి కుటుంబం సినిమాలు సిల్వర్ జుబిలీలు గా నిలిచాయి. అయినప్పటికీ ఆ తరువాత మళ్ళీ అపజయాలు తప్పలేదు. ఆ తరుణంలో కృష్ణ నిర్మించిన దేవుడు చేసిన మనుషులు, విశ్వేశ్వరరావు నిర్మించిన దేశోద్ధారకులు సినిమాలు సరికొత్త చరిత్రను నెలకొల్పాయి. ఈ రెండు సినిమాలు రెండు వందలరోజులు పైగా నడిచాయి. అయినప్పటికీ, మళ్ళీ రెండు మూడేళ్లు సరైన హిట్స్ రాలేదు. మధ్యలో నిప్పులాంటి మనిషి అనే గొప్ప హిట్ అందింది. అయినప్పటికీ, ఎన్టీఆర్ పని అయిపోయిందని ప్రచారం మాత్రం ఆగలేదు.
అలాంటి తరుణంలో ఇద్దరు అద్భుతమైన ప్రతిభ కలిగిన యువ దర్శకులు సినిమారంగం ప్రవేశం చేశారు. అప్పటికే యాభై ఏళ్ళవయసు దాటిన ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా కథలను సృష్టించారు. వారిద్దరూ దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు అని చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ పోటీపడి ఎన్టీఆర్ కు సూపర్ డూపర్ హిట్లు అందించారు. మనుషులంతా ఒక్కటే, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి లాంటి మహత్తరమైన విజయాలను అందించగా, వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, అడవిరాముడు, గజదొంగ, డ్రైవర్ రాముడు, మేజర్ చంద్రకాంత్ లాంటి అజరామరమైన హిట్స్ అందించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. నేరం నాదికాదు ఆకలిది, యమగోల, నాదేశం, అనురాగదేవత, ఎదురులేనిమనిషి, చండశాసనుడు లాంటి హిట్స్ అన్నీ ఎన్టీఆర్ యాభై అయిదేళ్ల వయసు దాటాక అందుకున్నవే.
అరవై ఏళ్ళవయసులో కూడా ఘనాతిఘనమైన విజయాలను అందించడం ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే చెల్లింది. తన కెరీర్ లో తల్లీ కూతుళ్లయిన సంధ్య-జయలలితతో, అమ్మాజీ-జయచిత్రలతో కలిసి హీరోగా నటించిన ఏకైక నటసింహం నందమూరి. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా, స్టూడియో అధిపతిగా, థియేటర్ల అధినేతగా ఎన్టీఆర్ పార్శ్వాలు అనంతం. వేలు పెట్టిన అన్ని రంగాల్లో విజయాన్ని చవిచూసిన అదృష్టవంతుడు ఆయన. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే గొప్ప నటనా కౌశలం ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే సొంతం.
డాక్టర్ సి నారాయణరెడ్డి మాటల్లో చెప్పాలంటే ఎన్టీఆర్ “కారణజన్ముడే కాదు – రణజన్ముడు” కూడా. సినిమా, రాజకీయ రంగాల్లో ఆయన సాధించిన విజయాలు అనన్య సామాన్యం. అనితరసాధ్యం. ఎన్టీఆర్ గూర్చి రాయాలంటే వెయ్యి పేజీలు కూడా సరిపోవు. విస్తరణభీతి కారణంగా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ప్రస్తావించలేకపోతున్నాను.
జీవితంలో ఇన్ని ఘనవిజయాలు సాధించి, ఆరుకోట్ల ఆంధ్రుల ముద్దుబిడ్డగా, ఆరాధ్యనీయుడుగా, అందగాడుగా, సమ్మోహనాకారుడుగా, ఎదురులేని, తిరుగులేని టైగర్ గా జన నీరాజనాలు అందుకున్న ఎన్టీఆర్ జీవితంలో చివరి ఎనిమిది మాసాలు మానసికక్షోభతో గడవడం జీర్ణించుకోలేని విషాదఘట్టంగా చెప్పుకోవాలి. జీవితచరమాంకంలో తోడుకోసం, నీడకోసం శ్రీమతి లక్ష్మీపార్వతిని పునర్వివాహం చేసుకోవడమే ఆయన చేసిన నేరం. బంధువులు మాత్రమే కాదు…కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను కాకుల్లా పొడుచుకుని తిన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలోని కొందరు సభ్యులతో నాకు కల అనుబంధం దృష్ట్యా వాటిని ఇక్కడ ప్రస్తావించలేకపోతున్నాను. మృగరాజులా ఠీవిగా జీవించిన ఆ ఆరడుగుల మొనగాడు చివరకు భూకంపం ధాటికి వేళ్ళతో సహా కూలిపోయిన వటవృక్షంలా … కడుదీనంగా…వందలాదిమంది కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఉన్నప్పటికీ, ఎవరూ పక్కన లేకుండా ఏకాంతంగా అమరపురికి తరలివెళ్లడం అభిమానుల నయనాలను అశ్రుజలపాతాలను చేసింది.
చివరగా చెప్పాల్సిన మాట ఏమిటంటే….ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేసిన మరుసటి రోజు డాక్టర్ సి నారాయణరెడ్డి, నేను ఒక సాహిత్యసభలో వక్తలుగా పాల్గొన్నాము. “జీవితమే ఒక వైకుంఠపాళి…నిజం తెలుసుకో భాయి…ఎగరేసే నిచ్చెనలే కాదు.. పడదోసే పాములు ఉంటాయి” అని ఎన్టీఆర్ కోసం ఒక చరణం రాశాను. సినిమాలో ఆ పాటకు అద్భుతంగా నటించిన ఎన్టీఆర్..నిజజీవితంలో మాత్రం నటించలేక పాటించలేక పోయారు” అన్నారు విషణ్ణవదనంతో.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు