HYDRA: హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో జరిగిన హైడ్రా ప్రజావాణి కార్యక్రమం ఈసారి కూడా భారీ స్పందనను రాబట్టుకుంది. చెరువుల రక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా చేపట్టిన కృషి ప్రస్తుతం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో ప్రతీ సోమవారం హైడ్రా కమిషనర్ కార్యాలయం జనంతో కిక్కిరిసిపోతోంది.
ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు సమర్పించబడ్డాయి. చెరువుల ఆక్రమణలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ పలు కీలక సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా ప్రజల సమస్యలు వినడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
సాయంత్రం ఆరు గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించడానికి కార్యాలయం అందుబాటులో ఉంది. హైడ్రా ఏర్పాటు తర్వాత నగరంలో చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట పడింది. చెరువుల సమీపంలో కట్టిన అనధికారిక నిర్మాణాలను తక్షణమే కూల్చివేస్తూ హైడ్రా తీవ్ర దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవల కొన్ని కీలక ప్రాంతాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలు హైడ్రా దూకుడు మంత్రాన్ని మరింత చాటిచెప్పాయి. రానున్న రోజుల్లో హైడ్రా పలు బడా నేతలకు సంబంధించిన భూములపై కూడా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు సడన్ షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.