ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తెలంగాణ ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (HYDRA) కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశం సుమారు రెండు గంటల పాటు సాగింది.
డిప్యూటీ సీఎం కార్యాలయం ఈ భేటీని పూర్తిగా ‘మర్యాదపూర్వక సమావేశం’గా పేర్కొంది. అయితే, ఈ సందర్భంగా ఇద్దరూ పలు పరిపాలనా, సామాజిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా అనధికార నిర్మాణాల కూల్చివేతలు, జలవనరుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేసే ‘హైడ్రా’ కార్యాచరణ, దాని విజయావకాశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో హైడ్రా సంస్థ అనధికార నిర్మాణాల కూల్చివేతలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో తీసుకున్న కఠిన చర్యలకు గతంలో మంచి ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా ఐపీఎస్ రంగనాథ్ నేతృత్వంలో బడాబాబుల ఫామ్‌హౌస్‌ల కూల్చివేత, చెరువుల పరిరక్షణ విధానానికి పవన్ కల్యాణ్ ఆ సమయంలోనే మద్దతు తెలిపారు. ఏపీలో కూడా హైడ్రా తరహా కఠిన వ్యవస్థ ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన అప్పుడే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, రంగనాథ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి చర్చలు జరపడం ఏపీ నగర పాలనలో సరికొత్త సంస్కరణల ఆవశ్యకతను సూచిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో అనధికార నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జా, ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని జల వనరుల ఆక్రమణ వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి తెలంగాణ హైడ్రా సాధించిన లక్ష్యాలు, కార్యవిధానాలు ఏపీకి ఉపయోగపడతాయని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. పట్టణ మౌలిక సదుపాయాల ప్రణాళిక, మెరుగైన పర్యవేక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అనుభవాన్ని విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల భవిష్యత్తు అభివృద్ధికి వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
హైడ్రా తరహా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైతే కబ్జాలు తగ్గి, ప్రభుత్వ స్థలాలు పూర్తిగా రక్షించబడతాయని సగటు పౌరులు ఆశిస్తున్నారు.

