కుంభమేళా దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న హైదరాబాద్ వాసులకు ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ సమీపంలో ప్రయాణిస్తున్న మినీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బస్సులో ఉన్నవారు అక్కడే చిక్కుకుపోయారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ రాంగ్ రూట్‌లోకి రావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా వస్తున్న మినీ బస్సు అదుపుతప్పి లారీకీ బలంగా ఢీకొట్టినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారంతా హైదరాబాద్‌లోని నాచారం వాసులుగా గుర్తించారని పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి గురైన మినీ బస్సు (ఏపీ 29 డబ్ల్యూ 1525) ఏపీ రిజిస్ట్రేషన్‌లో ఉండటంతో మొదట్లో ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ వాసులేనని భావించారు. కానీ, అక్కడ లభించిన ఆధారాలతో వారు హైదరాబాద్ వాసులని నిర్ధారించారు. చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం.
ఈ విషాద ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుంభమేళా సందర్శనానికి వెళ్లిన భక్తులు తమ కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా తిరిగి రాలేకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.