Cyber Crime: మోబైల్ లో పోర్న్ చూస్తున్నారా.. అయితే జాగ్రత్త… మీ బ్యాంక్ ఖాళీ కావచ్చు..!

ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు ఊహించని విధంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ చాలామంది ఫోన్ కాల్స్, మెసేజులు ద్వారా బ్యాంకు డిటెయిల్స్ అడిగే మోసగాళ్ల గురించీ వినుంటారు. కానీ తాజాగా ఒక కొత్త మోసపు తంతు హైదరాబాద్‌ వాసులను టార్గెట్ చేస్తోంది.. అది అశ్లీల వీడియోలు చూశారన్న నకిలీ ఆరోపణలతో బెదిరించడం..

ఇటీవల నగరంలో చాలామంది వినూత్న మోసానికి గురవుతున్నారు. వాట్సాప్‌లో “కేంద్ర హోం మంత్రిత్వ శాఖ” పేరుతో లేఖలు వచ్చాయి. అందులో “మీ ఐపీ అడ్రస్ ఆధారంగా మీరు పిల్లల అశ్లీల వీడియోలు చూసినట్టు గుర్తించాం. 24 గంటల్లో స్పందించకపోతే చర్యలు తీసుకుంటాం” అంటూ హెచ్చరికలు ఉన్నాయి. మామూలుగా చూస్తే ఆ లేఖలపై ప్రభుత్వ అధికార ముద్రలు, పోలీసు స్టేషన్ లేఖలలాంటి ఫార్మాట్, అధికారుల ఫోటోలు కూడా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ నకిలీ కావడమే అసలు విషయం.

ఎల్‌బి నగర్‌కు చెందిన ఒక యువకుడికి ఇటువంటి లేఖ వచ్చింది. మొదట భయపడినా, తరువాత తనకు అలాంటి అలవాట్లు లేవని గుర్తు చేసుకొని, అది బూటకమని తెలుసుకున్నాడు. ఇదే తరహాలో మరొక ఘటనలో, ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి డ్రగ్ కేసు, మనీలాండరింగ్ కేసులో మీరు ఉన్నారు అంటూ కాల్ వచ్చింది. ఆధార్ నంబర్ అడిగి, తర్వాత అతను పోర్న్ కంటెంట్ వీక్షిస్తున్నట్లు చూపుతూ బెదిరించి రూ.1.5 లక్షలు దోచేశారు.

ఇవన్నీ బాగా ప్రణాళికతో పనిచేసే సైబర్ ముఠాల పన్నాగాలు. అవి బాధితుల భయాన్ని, అవమాన భయాన్ని ఉపయోగించుకుంటాయి. “CBI నుంచి మాట్లాడుతున్నాం”, “Cyber Crime Office”, “Narcotics Bureau” అంటూ ఫేక్ గుర్తింపులతో కలవరం సృష్టిస్తారు. బాధితులు తాము ఏమైనా తప్పు చేశామేమో అనే అనుమానంతో స్పందిస్తే… అదే ముఠాల విజయానికి కారణమవుతుంది.

అలాంటి సందేశాలే వస్తే ఏం చేయాలి: ముందుగా భయపడకండి. ప్రభుత్వ సంస్థలు మీకు వాట్సాప్ మెసేజ్‌లు పంపవు. అసలైన అధికారిక సమాచారాన్ని మీరు గుర్తించగలిగేలా ఉంటే తప్ప నమ్మవద్దు. .gov.in లేదా .nic.in వంటి అధికారిక ఈమెయిల్ ఐడీల నుంచే సమాచారం వస్తుంది. ఇలాంటి మోసాల గురించి వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి. అనుమానాస్పద మెసేజ్ వచ్చినప్పుడు ఒక క్షణం ఆలోచించండి అది నిజమైనదా కాదా అని పరిశీలించండి.

ఈ డిజిటల్ యుగంలో భద్రత కేవలం పాస్‌వర్డ్‌లో కాదు అవగాహనలో ఉంది. మోసగాళ్లకన్నా తెలివిగా ఉండాలి. “భయం మీద కాకుండా, సమాచారం మీద ఆధారపడితేనే సురక్షితం.