Hyderabad Fire Accident: హైదరాబాద్ లో ఆగని అగ్ని ప్రమాదాలు.. ఈసారి 17 మంది మృతి!

హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో ఆదివారం (మే 18, 2025) ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది సజీవ దహనమై మరణించారు. రెండంతస్తుల (G+2) భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండటం అందరినీ కలిచివేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది, బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిమాపక భద్రతా నిబంధనల లోపాన్ని మరోసారి ఎత్తిచూపింది.

ఈ దుర్ఘటనకు రెండు రోజుల ముందు (మే 16) అఫ్జల్‌గంజ్‌లోని మూడంతస్తుల (G+3) భవనంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు, కానీ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ఎనిమిది మందిని, అందులో ఓ పసికందును కాపాడారు. గతంలో జియాగూడ (జులై 2024), నాంపల్లి (నవంబర్ 2023), స్వప్నలోక్ కాంప్లెక్స్ (మార్చి 2023), నల్లగుట్ట (జనవరి 2023) వంటి ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు, ఈ ఘటనలు నగరంలో అగ్ని భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.

సికింద్రాబాద్‌లో 2022లో హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది, అదే ఏడాది స్క్రాప్ గిడ్డంగిలో 11 మంది వలస కార్మికులు మరణించిన ఘటనలు ఇప్పటికీ నగర జనానికి గుర్తున్నాయి. ఈ ఘటనలన్నింటిలో గ్రౌండ్ ఫ్లోర్‌లో వాణిజ్య సంస్థలు, పై అంతస్తుల్లో నివాసాలు ఉండటం, అగ్ని భద్రతా నిబంధనలు పాటించకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రతి ప్రమాదం తర్వాత అధికారులు చర్యలు తీసుకుంటామని హామీలిచ్చినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదని నగర జనం విమర్శిస్తున్నారు.

తాజా ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందిస్తూ, అగ్నిమాపక భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసు, అగ్నిమాపక సేవలు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖలను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా నగరంలో భద్రతా ప్రమాణాలపై అధికారులు తీవ్ర దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.