సినిమా వేరు, రాజకీయం వేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలుగు నాట మెగాస్టార్ చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీ సమయంలో అదే తెలిసొచ్చింది. ఆయన త్వరగానే ‘వాస్తవం’ తెలుసుకున్నారు.. రాజకీయాల నుంచి తక్కువ సమయంలోనే తప్పుకున్నారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం, ఇంకా ఇంకా ఏదో ‘అన్వేషిస్తూనే’ వున్నారు రాజకీయాల్లో. ఇప్పుడున్న రాజకీయాల నుంచి నిజాయితీని ఆశించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. డబ్బు పంచకుండా రాజకీయాలు చేయడం సాధ్యమయ్యే పని కాదు. కులం, మతం, ప్రాంతమంటూ రాజకీయాలు చేయకపోతే, రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టం. సినీ అభిమానులు, పవన్ ఎక్కడికి వెళ్ళినా పూల వర్షం కురిపిస్తారు. సినిమా హీరోయిన్లు, కమెడియన్లకూ ఇలాంటివి మామూలే. అయితే, వాళ్ళతో పవన్‌ని పోల్చడం ఎంతవరకు సబబు? అన్నది వేరే చర్చ. తిరుపతికి పవన్ కళ్యాణ్ తాజాగా వెళితే పూల వర్షం కురిసింది.
జనసేన కార్యకర్తలు, పవన్ సినీ అభిమానులూ.. ఆయన మీద అమితమైన ప్రేమ ప్రదర్శించారు. ఇలాంటివి పవన్ కళ్యాణ్ గతంలో కూడా చాలానే చూశారు. నిజానికి, ఇలాంటివి పవన్ కళ్యాణ్‌కి పెద్దగా ఇష్టం వుండవు కూడా. అయితే, ప్రజాభిమానం సంపాదించడమెలా.? అన్న విషయమ్మీద మాత్రం పవన్ ఇంకా సరైన విధంగా దృష్టి పెట్టడంలేదు. నిఖార్సయిన రాజకీయం చేయబోతున్నామంటూ పదే పదే చెప్పే పవన్, ఆ రాజకీయమేంటో రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యర్థులకు రుచి చూపించడంలేదు. పంచాయితీ ఎన్నికల చర్చ జరుగుతున్న సమయంలో అయినా, పార్టీ శ్రేణులకు పవన్ సరైన దిశా నిర్దేశం చేయలేకపోతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక జరగాల్సి వున్న నేపథ్యంలో తిరుపతిలో పీఏసీ సమావేశం పెట్టారు. కానీ, పార్టీ శ్రేణులకు పవన్ తగిన రీతిలో సందేశం ఇవ్వగలుగుతారా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అసలు జనసేన పార్టీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేయకపోవచ్చన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్న వేళ, బీజేపీ ఈ విషయమై జనసేనను సైడ్ లైన్ చేయాలనుకుంటున్న వేళ.. జనసేనాని తన బలమెంతో, తన పార్టీ జనసేన బలమెంతో చూపించడానికైనా సరైన రీతిలో ముందడుగు వేయాల్సి వుంది. కానీ, జనసేన అధినేత నుంచి అంతటి చిత్తశుద్ధిని జనసైనికులు సైతం ఆశించలేని పరిస్థితి. ఇలాగే రాజకీయాలు చేస్తూ వుంటామంటే.. సినీ నటుడిగా పూల జల్లు తప్ప, రాజకీయ నాయకుడిగా ఓట్ల జల్లుని ఆయన ఎప్పటికీ చూడలేరేమో.