వైఎస్ షర్మిల కొత్త పార్టీ గురించి అందరికన్నా ముందు టీడీపీ అనుకూల మీడియాకి చెందిన ఓ మీడియా సంస్థ అధినేతకు తెలిసింది. దాంతో, తొలుత ఈ విషయాన్ని సదరు మీడియా సంస్థ ‘బ్రేక్’ చేసింది. ‘అదంతా ఉత్తదే’ అని చాలామంది అనుకున్నారు. అన్నకు పోటీగా చెల్లెలు పార్టీ పెట్టడం, అందునా ఆంధ్రపదేశ్‌లో కాకుండా, తెలంగాణలో పెట్టడం సాధ్యమయ్యే పనే కాదని భావించారు. కానీ, షర్మిల కొత్త పార్టీ తెలంగాణలో పెట్టబోతున్నట్లు ప్రకటించేశారు. నిజానికి వైసీపీకి సదరు మీడియా సంస్థ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిలా వుంటోంది. ఆ సంస్థ అధిపతిని వైసీపీ, శతృవుగా చూడటం అందరికీ తెలిసిన సంగతే. అసలు ఆ మీడియా సంస్థలో వైసీపీ నాయకులెవరూ కనిపించరు చర్చా కార్యక్రమాల విషయానికొస్తే. కానీ, షర్మిల పార్టీ తరఫున కొందరు మాత్రం ఆ ఛానల్ చర్చా కార్యక్రమంలో కనిపించారు. పార్టీ ఎలా పెట్టబోతున్నారు.? ఏం చేయబోతున్నారు.? అసలు ఎందుకోసం షర్మిల పార్టీ పెడుతున్నారు.? వంటి అంశాల గురించి సదరు నేతలు, ఆ ‘పచ్చ’ ఛానల్‌లో మాట్లాడారు.
ఇది వైసీపీ నేతలకు అస్సలు మింగుడు పడటంలేదు. షర్మిల పార్టీతోగానీ, ఆ పార్టీకి చెందిన వ్యక్తులతోగానీ వైసీపీకి సంబంధమే లేదని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ, షర్మిల పెట్టబోయే పార్టీకి చెందిన నేతలు మాత్రం, వైసీపీ భావజాలాన్ని వినిపిస్తున్నారు పచ్చ ఛానల్‌లో కూడా. దాంతో, షర్మిల పార్టీ వార్త సదరు మీడియా సంస్థకి తొలుత ఎలా తెలిసింది.? అని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామం కాబట్టి, సదరు సంస్థ తమకు అందిన సమాచారాన్ని విశ్లేషించి, అదనపు సమాచారాన్ని సేకరించి.. షర్మిల పార్టీపై కథనాన్ని ప్రచారంలోకి తెచ్చిందా.? లేదంటే, సదరు మీడియా సంస్థని షర్మిల తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నరా.? అన్నది చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి చెందిన మీడియా సంస్థ షర్మిల వ్యవహారంపై ఆచి తూచి వ్యవహరించింది. బయట ఎంత హంగామా జరుగుతున్నా వైసీపీ మీడియా సంస్థల్లో పెద్దగా హడావిడి కనిపించకపోవడమంటే బహుశా షర్మిలను వైఎస్ జగన్ పూర్తిగా దూరం పెట్టారనుకోవాలేమో.