పశ్చిమ బెంగాల్‌కి చెందిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ కేసు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇక కోల్కతా హైకోర్టులో ఊరట లభించలేదు. ‘ఆపరేషన్ సిందూర్’పై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం దాఖలైన అభ్యర్థనను న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది. ఈ సందర్భంగా శర్మిష్ఠ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
“వాక్ స్వాతంత్ర్యం ఉన్నా అది పరిమితుల లోపలే ఉండాలి. ఇతరుల మనోభావాలను దెబ్బతీయడాన్ని సహించలేము” అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన అంశం మే 14న శర్మిష్ఠ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’పై బాలీవుడ్ ప్రముఖుల మౌనం ఎందుకు అనే ప్రశ్నతో ఆమె వీడియోలో పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో, ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమె అనంతరం తన పోస్టులు తొలగించి క్షమాపణలు చెప్పారు. కానీ, అప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ.. “మన దేశంలో వివిధ మతాలు, జాతులు కలిసి నివసిస్తున్న పరిస్థితుల్లో మాట్లాడేటప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి. వాక్ స్వాతంత్ర్యం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే అది నేరంగా పరిగణించబడుతుంది. బాధ్యతాయుతమైన మాటలు, భావ ప్రకటనలే సమాజాన్ని ఒకేసారి గౌరవించగలవు” అని పేర్కొంది. అంతిమంగా శర్మిష్ఠ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు, ఆమెను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఉత్తర్వులిచ్చింది.